JC Prabhakar Reddy: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. తాడిపత్రి వెళ్లడానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. దీంతో, ఇన్ని రోజులు అడ్డుంకులు ఎదుర్కొన్న పెద్దారెడ్డి.. ఇప్పుడు తాడిపత్రిలో అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నారు.. ఈ నేపథ్యంలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రపతి అనుమతి ఇచ్చినా.. తెలుగుదేశం నాయకుడు పొట్టి రవిని తాడిపత్రికి రానివ్వలేదని గుర్తుచేశారు.. అయితే, పెద్దారెడ్డిని తాడిపత్రికి రానివ్వకుండా పెద్దారెడ్డి వల్ల నష్టపోయిన బాధితులే అడ్డుకుంటారని పేర్కొన్నారు.. అధికారం అడ్డం పెట్టుకొని పెద్దారెడ్డి చేసిన అక్రమాలు, దౌర్జన్యాలు చాలా ఉన్నాయన్న ఆయన.. మహిళలు అని చూడకుండా టీడీపీ మహిళా కౌన్సిలర్లను పరిగెత్తించి కొట్టిన ఘనత పెద్దారెడ్డిది అని మండిపడ్డారు.. వైసీపీ హయాంలో పోలీసులు అండతో చాలామంది తెలుగుదేశం కార్యకర్తలపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి జిల్లా బహిష్కరణ చేసిన ఘనత పెద్దారెడ్డిది అని విమర్శించారు.. తాడిపత్రిలో రాజకీయాలు చేయడానికి పెద్దారెడ్డి కుటుంబానికి అర్హత లేదన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి..
Read Also: Pawan Singh : పబ్లిక్‌గా హీరోయిన్‌తో స్టార్ హీరో సరసాలు.. స్టేజ్‌పైనే వివాదం!
కాగా, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. అనంతపురం జిల్లా తాడిపత్రి ఎంట్రీకి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తనను తాడిపత్రిలోకి రాకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారంటూ సుప్రీంకోర్టును మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆశ్రయించారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. తాడిపత్రికి వెళ్లేందుకు పెద్దారెడ్డికి సెక్యూరిటీ ఇవ్వాలని కూడా పోలీసులను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇక, సుప్రీంకోర్టు తీర్పుపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘నేను తాడిపత్రి వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టులో న్యాయం గెలిచింది. సుప్రీంకోర్టు తీర్పు కాపీలను ఎస్పీకి అందజేస్తా. త్వరలోనే నేను తాడిపత్రి వెళ్తాను. తాడిపత్రి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటా, సేవ చేస్తా. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు పోలీసులకు సహకరిస్తాను’ అని పెద్దారెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు జేసీ వ్యాఖ్యలతో మళ్లీ తాడిపత్రిలో ఎలాంటి పరిస్థితి వస్తుంది అనేది ఉత్కంఠగా మారింది..