మెగా ఫ్యామిలీతో ముందు నుంచి కూడా బలమైన అనుబంధం ఉన్న సహజ నటి జయసుధ. చిరంజీవి, నాగబాబులతో పాటు పవన్ కల్యాణ్‌తో కలిసి నటించిన ఆమె, గతంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా కూడా సేవలు అందించారు. అయితే తాజాగా ఏపీలో జరిగిన ఒక ఈవెంట్‌లో జయసుధ పవన్ కల్యాణ్ వ్యక్తిత్వం, రాజకీయ నిబద్ధత గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆయనొక “వండర్‌ఫుల్ మ్యాన్” అని.. డిప్యూటీ సీఎం అయినప్పటికీ, ఆయన వైఖరిలో ఎలాంటి నటన ఉండదని, అప్పటికి, ఇప్పటికి ఆయనలో మార్పు లేదని జయసుధ అన్నారు.
Also Read : Mahavatar: పరశురాముడి కథలోకి దీపికా? ‘మహావతార్’ పై బాలీవుడ్ బిగ్ బజ్
పవన్ కల్యాణ్ గురించి తన వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకున్న జయసుధ.. ‘సినిమా రంగంలో అయినా, రాజకీయాల్లో అయినా ఆయన ఎవరికీ తలవంచే రకం కాదు. ఆయనకంటూ సొంత స్టైల్, కొన్ని ప్రత్యేక సిద్ధాంతాలు, పట్టుదల ఉండడం వల్లే, రాజకీయాల్లోని అనేక ఒడిదొడుకులను, వ్యతిరేకతను ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలుగుతున్నారు. పవన్ కల్యాణ్ పడిన కష్టం, ప్రజా జీవితం పట్ల ఆయనకున్న సిన్సియారిటీ వేరే ఎవరైనా అయితే ఈ పాటికే రాజకీయాలను వదిలేసి వెళ్లిపోయేవారు’ అని ఆమె నొక్కి చెప్పారు.
అంతేకాకుండా, ఆయన ప్రజా జీవితం పట్ల చూపించే నిబద్ధతను గురించి కూడా జయసుధ మాట్లాడారు.. ‘సినిమా రంగంలో స్టార్ హీరోగా ఉన్న ఆయన, నటిస్తానని అంటే నిర్మాతలు, దర్శకులు ఎంతైనా డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, ఆ అవకాశాలు అన్నిటినీ వదులుకొని ప్రజా సేవకే మొగ్గు చూపారు. డబ్బుపై ఆశ చూపకుండా రాజకీయ రంగంలో ఉండే ఇబ్బందులను తట్టుకుని నిలబడిన ఆయన కమిట్‌మెంట్‌ను మెచ్చుకోవాలి. ఇవన్నీ నా వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే’ అని జయసుధ పేర్కొన్నారు. ఆయన మంచితనాన్ని ఆకాశానికి ఎత్తేసిన ఈ వీడియోను అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.
