జయసుధ – ఈ పేరు వింటే ఈ నాటికీ ఆ అందాల అభినయాన్ని గుర్తు చేసుకొని పరవశించిపోయేవారు ఎందరో ఉన్నారు. నాలుగు తరాల హీరోల చిత్రాలలో నటించి ఆకట్టుకున్న నటిగా జయసుధ పేరొందారు. ఈ నాటికీ తన దరికి చేరిన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నారు జయసుధ.
‘సహజనటి’గా పేరొందిన జయసుధ 1958 డిసెంబర్ 17న మద్రాసులో జన్మించారు. జయసుధ అసలు పేరు సుజాత. నటి, దర్శకురాలు విజయనిర్మలకు జయసుధ సమీపబంధువు. ఆ కారణంగానే 14 ఏళ్ళ ప్రాయంలోనే ‘పండంటి కాపురం’ చిత్రంలో నటించారు సుజాత. ఆ తరువాతే ఆమె పేరు జయసుధగా మారింది. ‘పండంటి కాపురం’లో జమునకు కూతురుగా నటించారు జయసుధ. తమిళంలో కె.బాలచందర్ దర్శకత్వంలో ‘అరంగేట్రం’లో నటించారు జయసుధ. ఆరంభంలో చిన్న చిన్న పాత్రల్లోనూ అలరించారు. తెలుగులో ‘లక్ష్మణరేఖ, జ్యోతి’ చిత్రాలు నటిగా జయసుధకు మంచి గుర్తింపును ఇచ్చాయి. ఓవైపు అందచందాలతో అలరిస్తూనే, మరోవైపు అభినయంతోనూ ఆకట్టుకున్నారు జయసుధ.
నాటి మేటి హీరోలు యన్టీఆర్, ఏయన్నార్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు అందరితోనూ విజయాలను చవిచూశారు జయసుధ.
నాటి స్టార్ హీరోస్ సరసన నటించే సమయంలో ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా ఎక్కువ సినిమాల్లో నటించారామె. టాప్ స్టార్స్ తోనే కాదు అప్పటి యంగ్ స్టార్స్ తోనూ జయసుధ నటించి మురిపించిన వైనాన్ని నాటి అభిమానులు ఈ నాటికీ మరచిపోలేదు.
యన్టీఆర్ తో “లాయర్ విశ్వనాథ్, కేడీ నంబర్ వన్, డ్రైవర్ రాముడు, యుగంధర్, సరదా రాముడు, మహాపురుషుడు, నాదేశం, శ్రీనాథ కవిసార్వభౌముడు” చిత్రాలలో సోలో హీరోయిన్ గానే నటించారు జయసుధ. ఇక “శ్రీతిరుపతి వేంకటేశ్వర కళ్యాణం, అడవిరాముడు, గజదొంగ, అనురాగదేవత” చిత్రాలలో మరో హీరోయిన్ తో కలసి కనిపించారు. యన్టీఆర్ తో జయసుధకున్న మరో విశేషమేమిటంటే – ఆయన రాజకీయ ప్రవేశం చేశాక నటించిన చివరి చిత్రం ‘నాదేశం’లోనూ, ఆయన నటజీవితంలో చివరగా విడుదలైన ‘శ్రీనాథ కవిసార్వభౌముడు’లోనూ జయసుధనే నాయికగా నటించారు. ఆ కారణంగానే ఈ యేడాది యన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఇటీవల జయసుధను తెనాలిలో ఘనంగా సన్మానించారు.
ఏయన్నార్ సరసన జయసుధ నటించిన “ప్రేమాభిషేకం, మేఘసందేశం, బంగారుకుటుంబం” చిత్రాలు ఆమెకు, సినిమాలకు ప్రభుత్వ అవార్డులు సంపాదించి పెట్టాయి. కృష్ణ భార్య విజయనిర్మలకు సమీప బంధువైన జయసుధ చాలా రోజులకు ఆయన సరసన నాయికగా నటించారు. అది కూడా విజయనిర్మల దర్శకత్వంలో రూపొందిన ‘డాక్టర్-సినీయాక్టర్’లో మొదటి సారి నటించారు. ఆ తరువాత అనేక చిత్రాలలో కృష్ణ, జయసుధ నటించి అలరించారు. ఇద్దరు భామల నడుమ నలిగే పాత్రల్లో శోభన్ బాబు ఎక్కువగా నటించేవారు. సదరు చిత్రాల్లో ఓ హీరోయిన్ గా జయసుధ తప్పకుండా ఉండేవారు. మరో నాయికగానే వేరొకరు నటించేవారు.
మోహన్ బాబుకు నటునిగా మంచి గుర్తింపు సంపాదించి పెట్టిన ‘గృహప్రవేశం’లోనూ జయసుధనే నాయిక. చిరంజీవితో ‘మగధీరుడు’లో నాయికగా నటించారు. అంతకు ముందు బాలచందర్ ‘ఇది కథ కాదు’లో చిరంజీవి భార్యగా కనిపించారు జయసుధ. ‘అధినాయకుడు’ చిత్రంలో బాలకృష్ణకు జోడీగా నటించారు జయసుధ.
‘నంది’ అవార్డుల్లో తొలిసారి ఉత్తమనటునిగా నిలచిన రికార్డ్ కృష్ణంరాజుదే. ‘అమరదీపం’ చిత్రం ద్వారా ఆయనకు తొలి నంది దక్కింది. తరువాత ‘బొబ్బిలి బ్రహ్మన్న’ చిత్రంతోనూ కృష్ణంరాజు ఉత్తమనటునిగా నందిని అందుకున్నారు. ఈ రెండు చిత్రాలలోనూ జయసుధ నాయిక.
మొత్తం నాలుగు నంది అవార్డులు సంపాదించిన తొలి నటిగా జయసుధ రికార్డు సృష్టించారు. అలాగే నంది అవార్డుల్లో ‘హ్యాట్రిక్’ సాధించిన ఏకైక నటిగానూ జయసుధ నిలిచారు. ‘ఇది కథ కాదు’తో తొలిసారి జయసుధ ఉత్తమనటిగా నంది అవార్డు అందుకున్నారు. 1981లో ‘ప్రేమాభిషేకం’, 1982లో ‘మేఘసందేశం’, 1983లో ‘ధర్మాత్ముడు’ చిత్రాల ద్వారా జయసుధ నంది అవార్డుల్లో హ్యాట్రిక్ సాధించారు.
మరో విశేషమేమంటే జయసుధ చివరి సారి ఉత్తమనటిగా నంది అవార్డు అందుకున్న చిత్రం ‘ధర్మాత్ముడు’. ఇందులో జయసుధకు కూతురుగా నటించిన విజయశాంతి ఆ తరువాత నాలుగు సార్లు ఉత్తమనటిగా నంది అవార్డును అందుకున్నారు. నంది అవార్డుల్లో వీరిద్దరే ఇప్పటికీ అత్యధిక అవార్డులతో నిలిచారు.
నంది అవార్డుల్లో ఉత్తమనటిగానే కాకుండా, ఉత్తమ గుణచిత్ర నటిగా “జైలర్ గారి అబ్బాయి, యువకుడు” చిత్రాల ద్వారా నందిని అందుకున్నారు. అలాగే ఉత్తమ సహాయనటిగా “స్వాతిచినుకులు, శతమానంభవతి” చిత్రాల ద్వారా నంది అవార్డుకు ఎన్నికయ్యారు.
తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ చిత్రాలలో జయసుధ నటించి ఆకట్టుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో జితేంద్ర సోదరుడైన నితిన్ కపూర్ ను వివాహమాడారు జయసుధ. వారికి ఇద్దరు పిల్లలు. వారిలో చిన్నబ్బాయి శ్రేయాన్ హీరోగా నటించాడు. భర్త నితిన్ కపూర్ తో కలసి ‘జె.కె. ఫిలిమ్స్’ పతాకంపై “ఆది దంపతులు, కాంచన సీత, కలికాలం, అదృష్టం, వింత కోడళ్లు, హ్యాండ్సప్, మేరా పతి సిర్ఫ్ మేరా హై” వంటి చిత్రాలు నిర్మించారు.
జయసుధకు జయప్రద క్లోజ్ ఫ్రెండ్. జయప్రద తెలుగుదేశం పార్టీలో చేరిన తరువాత జయసుధ కూడా ఆ పార్టీలో చేరారు. అయితే నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పిలుపుతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009లో సికింద్రబాద్ నియోజకవర్గం నుండి గెలుపొంది, ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2014లో అదే నియోజకవర్గంలో పరాజయం చవిచూశారు. ప్రస్తుతం తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేస్తూ సాగుతున్నారు జయసుధ. ఆమె మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆశిద్దాం.