జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ సుడిగాలులు( వాటర్ స్పౌట్) బీభత్సం సృష్టించాయి. పలిమెల మండలంలోని లెంకలగడ్డలో గోదావరి పరివాహక అటవీ ప్రాంతంలో సుడిగాలుల ఏర్పడడంతో భారీగా చెట్లు ,మిర్చి, పత్తి పంటలు నెలకొరిగాయి. గత సంవత్సరం సెప్టెంబర్ నుండి ఇప్పటి వరకు మూడు సార్లు ప్రకృతి విలయతాండవం చేయడం సంచలనంగా మారింది. అయితే గత సంవత్సరం సెప్టెంబర్, డిసెంబర్ నెలల్లో ములుగు జిల్లా మేడారం అటవీ ప్రాంతంలో బీభత్సం చోటు చేసుకోగా తాజాగా లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో ప్రళయం సంభవించడం గమనార్హం. మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల మధ్య ఏర్పడిన వాటర్ స్పౌట్ ఉత్తర దిశ నుండి దక్షిణం వైపు ప్రయాణం చేసింది.
Also Read:Rishabh Pant: టీమిండియాలోకి స్టార్ ప్లేయర్ రీఎంట్రీ.. ఎవరో తెలుసా?
దాదాపు 60 మీటర్ల వెడల్పుతో 3 కిలో మీటర్ల పొడవున సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. అయితే లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో వచ్చిన వాతావరణ మార్పుల ప్రభావం వల్ల కొంతమంది రైతులు ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. వ్యవసాయ అవసరాల కోసం మోటార్లను తరలిస్తున్న ఎద్దుల బండి కూడా సుడిగాలుల ఉధృతికి కొట్టుకపోయింది. దీంతో ఎడ్ల బండిలో తీసుకెల్తున్న వ్యవసాయ పనిముట్లన్ని తునాతునకలు అయ్యాయి.. వ్యవసాయ పనుల్లో నిమగ్నం అయిన కొంతమంది రైతులు వాటర్ స్పౌట్ కారణంగా పలుమార్లు గాల్లోకి లేవగా గురత్వాకర్షణ శక్తి వల్ల తిరిగి నేలపై పడిపోయారు.
ఇక్కడే ఉన్నట్టయితే ప్రాణాలు పోయేలా ఉందని గమనించిన రైతులు రాత్రి వరకూ ఇండ్లకు చేరుకుని భిక్కుభిక్కుమంటూ కాలం వెల్లదీశారు. లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో సంభవించిన వాటర్ స్పౌట్ ప్రభావంతో సుమారు 200 చిన్న,పెద్ద చెట్లు నేలకొరిగాయని పలిమెల FRO నాగరాజు తెలిపారు. లెంకలగడ్డ అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న వ్యవసాయ భూముల్లోని 10 ఎకరాల్లో మిర్చి, పత్తి పంటలు కూడా నాశనం అయ్యాయి. తాము తీవ్రంగా నష్టపోయామని , ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
