బాలీవుడ్ లెజెండరీ నటి, అమితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం మరియు సుదీర్ఘ విరామం గురించి మనసు విప్పి మాట్లాడారు. 1971లో బిగ్ బీ తో వివాహం తర్వాత సినిమాలను తగ్గించిన జయా, 1981లో వచ్చిన ‘సిల్సిలా’ చిత్రం తర్వాత దాదాపు 14 ఏళ్ల పాటు పరిశ్రమకు దూరంగా ఉన్నారు. ఆ విరామానికి అసలు కారణం తన కూతురు శ్వేతా బచ్చన్ అని ఆమె వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
Also Read : Ajay Bhupathi : జయకృష్ణ కోసం ప్రత్యేక సెట్స్ – సాంగ్ షెడ్యూల్ రెడీ!
జయా బచ్చన్ ఆ రోజులను గుర్తు చేసుకుంటూ.. ‘ఒకరోజు నేను షూటింగ్‌కు సిద్ధమవుతూ ఇంట్లోనే మేకప్ వేసుకుంటున్నాను. అప్పుడు నా దగ్గరకు వచ్చిన చిన్నారి శ్వేత ఏంచేస్తున్నావని అడిగింది. నేను పనికి వెళ్తున్నానని చెప్పగానే, చాలా అమాయకంగా.. అమ్మ నువ్వు వెళ్లొద్దు, నాన్నను మాత్రమే వెళ్లమని చెప్పు అని అడిగింది. ఇంట్లో పనివాళ్లు ఉన్నా, తల్లి తోడు లేదనే వెలితి తనలో కనిపిస్తోందని నాకు అర్థమైంది. ఆ మాటతోనే వెంటనే సినిమాలకు స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నాను’ అని తెలిపింది. అలాగే తన రీ-ఎంట్రీ గురించి కూడా జయా బచ్చన్ ఆసక్తికర విషయాలు చెప్పారు..
‘శ్వేత వివాహం తర్వాత ఇంట్లో ఒంటరితనం పెరిగింది. ఏదో కోల్పోతున్నాననే బాధతో ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టుకున్నాను. ఆ ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి మళ్లీ సినిమాల్లో నటించడం ప్రారంభించాను’ అని వివరించారు. 1995లో ‘డాటర్స్ ఆఫ్ ది సెంచరీ’ తో పునఃప్రారంభించిన తన ప్రయాణం, ఇటీవల 2023లో వచ్చిన ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని’ వరకు కొనసాగిందని ఆమె పేర్కొన్నారు. మొత్తానికి, ఒక స్టార్ సెలబ్రిటీగా వెలిగిపోతున్న సమయంలో కేవలం కూతురు కోసం తన కెరీర్‌ను త్యాగం చేసిన జయా బచ్చన్ కథ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.