NTV Telugu Site icon

Jay Shah: మాట ఇచ్చిన ప్రకారం కప్ కొట్టాం.. మరో రెండు లక్ష్యాలు ఉన్నాయి!

Jay Shah

Jay Shah

టీ20 ప్రపంచకప్‌ 2024 ముందు బార్బడోస్‌లో భారత జెండాను ఎగురవేస్తాం అని అభిమానులకు బీసీసీఐ కార్యదర్శి జై షా మాట ఇచ్చారు. కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు టీ20 ప్రపంచకప్‌ విజేతగా నిలిచింది. తన మాట నిజమైనట్లు బుధవారం ముంబైలో జరిగిన వార్షిక సియట్ క్రికెట్ అవార్డుల కార్యక్రమంలో జై షా గుర్తు చేశారు. మరో రెండు లక్ష్యాలు టీమిండియా ముందు ఉన్నాయని చెప్పారు. ఛాంపియన్స్‌ ట్రోఫీ, టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో విజయం భారత్ లక్ష్యాలని, ఈ రెండింటినీ రోహిత్ సారథ్యంలోనే సాధించాలని ఆకాంక్షించారు.

సియట్ క్రికెట్ అవార్డుల కార్యక్రమంలో జై షా మాట్లాడుతూ… ‘అందరికీ ఒక విషయం గుర్తు చేద్దామనుకుంటున్నా. టీ20 ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందు రోహిత్ శర్మ మన జాతీయజెండాను బార్బడోస్‌ వేదిక వద్ద నిలబెడతాడని చెప్పా. చెప్పినట్లే మన కెప్టెన్ చేశాడు. 140 కోట్ల ప్రజల ఆశీర్వాదాలు జట్టుకు ఉన్నాయి. వచ్చే ఏడాది ఛాంపియన్స్‌ ట్రోఫీ, టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ ఉన్నాయి. ఆ రెండు భారత జట్టు ముందున్న లక్ష్యాలు. రోహిత్ వాటిని కూడా సాదిస్తాడనే నమ్మకం ఉంది’ అని ధీమా వ్యక్తం చేశారు.

Also Read: బుల్లెట్‌ప్రూఫ్ ఫార్చ్యూనర్‌.. డీలర్‌షిప్ ద్వారా కస్టమర్లకు డెలివరీ!

‘ఈ ఏడాది అక్టోబర్‌లో మహిళల టీ20 ప్రపంచకప్‌ కూడా ఉంది. భారత జట్టు బాగుంది. తప్పకుండా మనం మరో కప్ కొడతాం. ఎక్సెలెన్స్ ఇన్‌ స్పోర్ట్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ అవార్డును మహిళా క్రికెట్‌ జట్టుతో పాటు 2023 పురుషుల వన్డే ప్రపంచ కప్ రన్నరప్, 2024 టీ20 ప్రపంచకప్‌ విజేత అయిన భారత క్రికెటర్లకు అంకితం చేస్తున్నా’ అని జై షా చెప్పారు. ఇక ఐసీసీ కొత్త ఛైర్మన్‌గా జై షా ఎన్నికవడం ఖాయం అని వార్తలు వినిపిస్తున్నాయి. ఆగస్ట్ 27న నామినేషన్కు చివరి తేదీ. అప్పుడు దీనిపై ఓ స్పష్టత రానుంది.