జనగామ జిల్లాలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్నపేగు బంధాన్ని తెంచుకుంటూ.. ఓ తల్లి రోడ్డు పక్కన పసికందును వదిలేసి వెళ్లిపోయింది. పసిబిడ్డ ఏడుపు విన్న స్థానికులు.. స్నానం పోసి అక్కున చేర్చుకున్నారు. పరిసర ప్రాంతాల్లో ఎంత వెతికినా ఆ బిడ్డ తల్లిదండ్రులు కనిపించలేదు. దాంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముక్కు పచ్చలారని పసికందును బహిరంగ ప్రదేశంలో వదిలేసిన ఘటన జిల్లాలో ఇప్పుడు కలకలం సృష్టించింది.
వివరాల ప్రకారం… జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురం గ్రామంలో రోడ్డుపై గుర్తుతెలియని మహిళ పసికందును వదిలేసి వెళ్లింది. ఈరోజు తెల్లవారుజామున పసిబిడ్డ ఏడుపు వినిపిస్తుండటంతో.. సమీపంలోని స్థానికులు నిద్ర లేచి చూశారు. అప్పుడే పుట్టిన మగ శిశువు రోడ్డుపై గుక్కపెట్టి ఏడుస్తున్నాడు. నడిరోడ్డుపై ముక్కు పచ్చలారని పసికందును చూసి స్థానికులు చలించిపోయారు. గ్రామంలోని ఒక వృద్ధురాలు చిన్నారిని చేరదీసి.. స్నానం చేయించింది.
Also Read: Crime News: వైష్ణవి హత్య కేసులో వీడని సస్పెన్స్.. లోకేశ్‌ను విచారిస్తున్న పోలీసులు!
ఖిలాషాపురం గ్రామస్తులు పసిబిడ్డ తల్లిదండ్రుల కోసం చుట్టుపక్కల అంతా వెతికినా లాభం లేకపోయింది. బిడ్డకు సంబంధించిన వారు ఎవరూ కనిపించకపోవడంతో గ్రామ పెద్దలు రఘునాథపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. పసిబిడ్డ తల్లిదండ్రుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. చుట్టుపక్కల వారా? లేదా దూరం ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ వదిలారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ఈ ఘటన రఘునాథపల్లి మండలంలో చర్చనీయాంశంగా మారింది.