Inter Student Vaishnavi murder in Gandikota: కడప జిల్లా గండికోటలో జరిగిన ఇంటర్ విద్యార్థిని వైష్ణవి హత్య కేసులో సస్పెన్స్ ఇంకా వీడలేదు. విద్యార్థిని హత్యపై అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. సోమవారం (జులై 14) ఉదయం 8.30 గంటలకు గండికోటకు చేరుకున్న వైష్ణవి, లోకేశ్.. 10:40 గంటలకు లోకేశ్ ఒక్కడే తిరిగి వెళ్లినట్లు సీసీ కెమెరాలు చూపిస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వైష్ణవి హత్య జరిగినట్లు వైద్యులు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. హత్య ఎవరు చేశారు అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.
ఇప్పటికే లోకేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వైష్ణవి హత్య కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. వైష్ణవి మృతదేహానికి మంగళవారం రాత్రి 10 గంటలకు పోస్టుమార్టం ముగిసింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఎర్రగుంట్ల మండలంలోని హనుమనగుత్తికి రాత్రి 12 గంటలకు కుటుంబ సభ్యులు తరలించారు. మృతదేహం రాకతో హనుమనగుత్తిలో విషాదఛాయలు నెలకొన్నాయి. ఈ రోజు ఉదయం వైష్ణవి స్వగ్రామం హనుమనగుత్తిలో అంత్యక్రియలు ముగిశాయి. నేడు వైష్ణవి స్వగ్రామానికి మహిళా కమీషన్ చైర్మన్ రానున్నారు.
Also Read: Banakacherla Project: నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం!
ఎర్రగుంట్ల మండలం హనుమనగుత్తికి చెందిన పసుపులేటి కొండయ్య, దస్తగిరమ్మ దంపతుల కూతురు వైష్ణవి (17). కొండయ్య కుటుంబం చదువుల నిమ్మిత్తం ప్రొద్దుటూరు గాంధీ రోడ్డులోని సార్వకట్ట వీధిలో నివాసం ఉంటున్నారు. వైష్ణవి ప్రొద్దుటూరులో ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుటోంది. సోమవారం ఉదయం కాలేజీకి వెళ్తున్నా అంటూ ఇంటి నుంచి బయలుదేరింది. వైష్ణవి కాలేజీకి రాలేదని లెక్చరర్లు కొండయ్యకు ఫోన్ చేశారు. కాలేజీకి వెళ్లి వైష్ణవి స్నేహితులను ఆరా తీయగా గండికోటకు వెళ్లిందని చెప్పారు. కుటుంబ సభ్యులు అందరూ ప్రొద్దుటూరులో సాయంత్రం వరకు వెతికినా ఆచూకీ లభించలేదు. దాంతో ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం గండికోటలోని రంగనాథస్వామి ఆలయం వెనుక భాగంలోని ముళ్లపొదల్లో వైష్ణవి మృతదేహం లభించింది.