NTV Telugu Site icon

Pawan Kalyan: వ్యక్తుల్లో మంచి, చెడు చూడాలి.. మతం కాదు..

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: రాజకీయ స్వార్థం కోసం మతాన్ని వాడుకునే వ్యక్తిని కాదు.. జనసేన ప్రభుత్వంలో ముస్లింల జీవన ప్రమాణస్థాయిని పెంచుతామని హామీ ఇచ్చారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ముస్లింల హక్కులకు భంగం వాటిల్లకుండా జనసేన చూసుకుంటుంది అని కాకినాడలో జరిగిన ముస్లిం ప్రతినిధుల ఆత్మీయ సమావేశంలో స్పష్టం చేశారు.. భారతదేశంలో ముస్లింలు ఏనాటికీ మైనారిటీలు కారని, ఈ దేశం మనందరిదీ అని తెలిపారు.. ముస్లింల భద్రత, గౌరవానికి ఏమాత్రం భంగం వాటిల్లకుండా జనసేన పార్టీ చూసుకుంటుందని చెప్పారు. దేశవిభజన సమయంలో జరిగిన మతఘర్షణల వల్ల 10 లక్షలమంది మరణించారు. కొంతమంది హిందువులు పాకిస్థాన్‌లో ఉండిపోతే మరికొంతమంది భారత్‌లో ఉండిపోయారు. ముస్లింలు కూడా మా సోదరులు అనుకోబట్టే అబ్దుల్ కలాం రాష్ట్రపతి అయ్యారు. అజారుద్దీన్ భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ అయ్యారని గుర్తుచేశారు.. వ్యక్తుల్లో మంచి, చెడు మాట్లాడుకోవాలి.. తప్ప మతం గురించి కాదని వ్యాఖ్యానించారు పవన్‌ కల్యాణ్.

Read Also: Harirama Jogaiah: ముద్రగడకు హరిరామ జోగయ్య కౌంటర్‌ లేఖ.. ఇప్పటి వరకు పెద్దమనిషివి అనుకున్నా..!

ఎవరు ఏ మతాన్ని నమ్మినా, ఏ దేవుడిని పూజించినా ఎవరికీ ఇబ్బంది లేదు.. కేవలం రాజకీయాల కోసం మతాన్ని వాడుకునే వారితోనే అందరికీ ఇబ్బంది అన్నారు పవన్‌ కల్యాణ్‌.. రాజకీయాల్లోకి రావడానికి ముందు మతాలు, మత ఘర్షణలపై చాలా అధ్యయనం చేశాను.. మత ప్రాతిపధికన భారతదేశం, పాకిస్థాన్‌ రెండు దేశాలుగా విడిపోవడం వరకు క్షుణ్ణంగా తెలుసుకున్నానని తెలిపారు. మహమ్మద్‌ అలీ జిన్నా.. హిందు, ముస్లింలు కలిసి ఉండలేరు.. ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలని పెట్టిన ప్రతిపాదన మేరకే దేశ విభజన జరిగింది.. దేశ విభజన సమయంలో అనేక మంది ఆడపడుచులు ఇబ్బందులు పడ్డారు.. ఆ సమయంలో జరిగిన ఘర్షణల వల్ల దాదాపు 10 లక్షల మంది మరణించారని.. కొంతమంది హిందువులు పాకిస్థాన్‌లో ఉండిపోతే.. కొంతమంది భారతదేశంలో ఉండిపోయారని తెలిపారు..

Read Also: Guntur Kaaram: థమన్ ఉన్నాడు కానీ పూజా ఔట్.. అసలు కారణం అదేనట?

ఇక, గత ఎన్నికల్లో ముస్లింలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని పూర్తిగా నమ్మి మద్దతు ఇచ్చారు. ఆ పార్టీకి 30 మంది ఎంపీలు ఉన్నారు. 25 ఎంపీలు ఇస్తే బీజేపీ మెడలు వంచి ప్రత్యేక హోదాను తీసుకు వస్తానని చెప్పిన నాయకుడు.. ఢిల్లీ వెళ్లి ఏం వంచుతున్నాడో మనందరికీ తెలుసంటూ సీఎం జగన్‌పై సెటైర్లు వేశారు పవన్‌ కల్యాణ్‌.. కానీ, నేను వైసీపీలా గుడ్డిగా బీజేపీకి మద్దతు ఇవ్వను. రంజాన్ పవిత్ర మాసంలో ముస్లిం ప్రతినిధులకు ఇఫ్తార్ ఇవ్వడంతో పాటు ఇస్లాం విద్య, ధార్మిక సంస్దలకు రూ.25 లక్షలు విరాళం ఇచ్చాను. నా వ్యక్తిగత సంపదను మీకు ఇచ్చిన వాడిని. రేపు జనసేన అధికారంలోకి వస్తే ఎంతగా అండగా ఉంటానో ఊహించండి అని వివరించారు.. బీజేపీతో పొత్తు పెట్టుకునే ఏ పార్టీ ముస్లింలకు నచ్చదు. జగన్ క్రిస్టియన్ కాబట్టి ఆయనను నమ్మవచ్చని ముస్లింలు అనుకుంటున్నారు. నేను, బీజేపీతో ఉన్నానని ముస్లింలు నన్ను వదిలేస్తే మీరు నష్టపోతారు. ముస్లింలు జనసేనకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.