NTV Telugu Site icon

TDP-Janasena: కూటమిలో ‘లోకల్’ పంచాయతీ.. టీడీపీపై అసంతృప్తి వెళ్లగక్కుతున్న జనసేన నాయకులు!

Tdp Janasena

Tdp Janasena

గుంటూరు తూర్పు నియోజకవర్గం ఉమ్మడి కూటమిలో అసంతృప్తి వెల్లువెత్తింది. తమకు న్యాయం జరగలేదని టీడీపీపై జనసేన నాయకులు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. గడచిన రెండేళ్లుగా తమకే సీటు అని ప్రచారం చేసి.. చివరి నిమిషంలో టీడీపీ సీటు దక్కించుకుందని జనసేన నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను చెప్పేంతవరకు, జనసేనకు న్యాయం జరిగేంత వరకు.. టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని గుంటూరు జనసేన నగర అధ్యక్షుడు నేరెళ్ళ సురేష్ అల్టిమేటం జారీ చేశారు.

టీడీపీ కార్యక్రమాలకు కార్యకర్తలు దూరంగా ఉండాలనే సందేశంతో కూడిన వాయిస్ రికార్డ్ ను నగర అధ్యక్షుడు నేరెళ్ళ సురేష్ పంపారు. గుంటూరులో జరుగుతున్న పరిణామాలపై టీడీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలో జనసేన నాయకులు సహకరించటం లేదని టీడీపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పొత్తుల్లో భాగంగా ప్రతి నియోజకవర్గంలో లోకల్ పంచాయతీలు చేయాలంటే ఎలా అంటూ టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

Also Read: Top Headlines @9AM: టాప్ న్యూస్!

జరుగుతున్న వ్యవహారాలపై జనసేన అధిష్టానం దృష్టి సారించాలని టీడీపీ నాయకులు అంటున్నారు. మరోవైపు తమకు అధిష్టానం చెప్పేంతవరకు ప్రచార కార్యక్రమాలలో పాల్గొనేది లేదని జనసేన నాయకులు భీష్మించుకున్నారు. జనసేన, టీడీపీ, లోకల్ నాయకుల పంచాయతీతో రెండు పార్టీల కార్యకర్తలు సందిగ్ధంలో పడ్డారు. ఉమ్మడిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలా? వద్దా? అంటూ ద్వితీయ శ్రేణి నాయకులకు కార్యకర్తలు ఫోన్లు చేస్తున్నారు.