NTV Telugu Site icon

Avanigadda: అవనిగడ్డ జనసేనలో ఆరని చిచ్చు..! బుద్ధప్రసాద్‌పై సంచలన వ్యాఖ్యలు

Mandali Buddha Prasad

Mandali Buddha Prasad

Avanigadda: అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం జనసేన పార్టీలో.. మండలి బుద్ధప్రసాద్‌ చేరికతో మొదలైన చిచ్చు ఆరడంలేదు.. టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌కు టీడీపీలో టికెట్‌ దక్కలేదు.. దీంతో, ఆయన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో.. పార్టీ కండువా కప్పుకున్నారు.. ఈ సారి ఆయన జనసేన పార్టీ నుంచి గ్లాస్‌ గుర్తుపై పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది.. అంతేకాదు.. జనసేనాని నుంచి టికెట్‌పై హామీ వచ్చిన తర్వాతే.. ఆయన సైకిల్‌ దిగారని టాక్‌ నడుస్తోంది. కానీ, అవనిగడ్డ అభ్యర్థిపై జనసేన హైకమాండ్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక, మండలి బుద్ధ ప్రసాద్… జనసేన పార్టీలో చేరికను నిరసిస్తూ ఈ రోజు అవనిగడ్డలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జనసేన నేత విక్కుర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నియోజకవర్గం పరిధిలోని ఆరు మండలాల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్‌పై విచురుకుపడ్డారు విక్కుర్తి శ్రీనివాస్.

Read Also: Bandi Sanjay: ఆరు గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ చేతులెత్తేసింది..! బండి కీలక వ్యాఖ్యలు

అవనిగడ్డ నియోజకవర్గానికి నిన్న బ్లాక్ డేగా అభివర్ణించారు విక్కుర్తి శ్రీనివాస్.. జనసేన పార్టీని అవమానించి అవహేళన చేసిన వ్యక్తి మండలి బుద్ధ ప్రసాద్‌ అని విమర్శించారు. జనసేన చిన్న పిల్లల పార్టీ అని చులకన చేసిన వ్యక్తి బుద్ధప్రసాద్ అని గుర్తుచేశారు. 40 శాతం ఓట్లు ఉన్న టీడీపీ వదిలి 6 శాతం ఓట్లు ఉన్న జనసేన పార్టీలోకి వెళ్లేదిలేదన్నాడు.. కానీ, ఇప్పుడు అదే పార్టీలో చేరారని మండిపడ్డారు. ఇక, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.. పొరపాటున కూడా బుద్ధప్రసాద్ కి టికెట్ ఇస్తారని అనుకోవటం లేదన్నారు. ఇలాంటి వ్యక్తిని పవన్ కల్యాణ్‌ ప్రోత్సహించరు, జనసైనికులు కూడా అంగీకరించరని స్పష్టం చేశారు. ప్రపంచమంతా నైతిక విలువల గురించి స్పీచ్ లు ఇచ్చే వ్యక్తి.. నైతిక విలువలు మరిచి రాజకీయాలు చేస్తున్నారు అంటూ మండలి బుద్ధప్రసాద్‌పై విరుచుకుపడ్డారు జనసేన నేత విక్కుర్తి శ్రీనివాస్.