Janasena: రేపట్నుంచి జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టనుంది. సభ్యత్వ నమోదు కార్యక్రమంపై నాదెండ్ల మనోహర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదును సంబరంలా చేద్దాం జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. అన్ని నియోజకవర్గాల్లో గురువారం పండగ వాతావరణంలో కార్యక్రమాన్ని ప్రారంభించాలని జనసేన నాయకులకు సూచించారు.
Read Also: AP Weather: కొనసాగుతున్న అల్పపీడనం.. కోస్తాంధ్రకు 2 రోజుల పాటు భారీ వర్షసూచన
పది రోజులపాటు ఆహ్లాదకర వాతావరణంలో కార్యక్రమం జరగాలన్నారు. ఎన్నికల అనంతరం పార్టీ తీసుకున్న కార్యక్రమాన్ని ఉత్సాహంగా చేపట్టాలని.. యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు సభ్యత్వ నమోదు కోసం వేచి చూస్తున్నారని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ 100 శాతం స్ట్రయిక్ రేటు విజయం సాధించామన్నారు. పార్టీకి ప్రజల్లో విశేషమైన ఆదరాభిమానాలున్నాయన్నారు. ఇప్పటికే ఉన్న 6.47 లక్షల క్రియాశీలక సభ్యత్వాన్ని రెన్యూవల్ చేయించాలని.. మరింత మంది క్రియాశీల సభ్యులను పార్టీలో చేర్పించాలని పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులకు సూచించారు. ఏ పార్టీలో లేని విధంగా జనసేనలో క్రియాశీల సభ్యులకు రూ. 5 లక్షల భీమా సౌకర్యం ఉందని నాదెండ్ల స్పష్టం చేశారు. ఈ నెల 18 నుంచి ప్రారంభం అయ్యే క్రియా శీలక సభ్యత్వ నమోదులో 9 లక్షల సభ్యత్వాలు నమోదు చేయాలనేది లక్ష్యం అని జనసేన ప్రకటించింది. దీనికి అనుగుణంగా పార్టీ నాయకులు, నియోజకవర్గ నేతలు ప్రణాళికబద్ధంగా పనిచేయాలని పార్టీ సూచించింది.