AP Weather: మధ్యప్రదేశ్ తీర పరిసర ప్రాంతం మీదుగా అల్పపీడనం కొనసాగుతోందని, దీనికి అనుబంధంగా ఆవర్తనం విస్తరించి ఉందని ఏపీ విపత్తు నివారణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాధ్ వెల్లడించారు. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపారు. మిగిలిన చోట్ల విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉంది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్స్ 1070, 112, 18004250101ను అధికారులు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున.. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద ఉండొద్దని సూచనలు చేశారు.
Read Also: Ambati Rambabu: ముద్రగడ లాంటి వ్యక్తిని నా జీవితంలో చూడలేదు..
అల్పపీడన ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం,మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలినచోట్ల అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తు నివారణ సంస్థ ఎండీ పేర్కొన్నారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.