NTV Telugu Site icon

Janareddy: వచ్చే ఎన్నికల్లో నేను పార్లమెంట్ బరిలో ఉంటా

Janareddy

Janareddy

నల్లగొండ జిల్లా హాలియాలో మాజీ సీఎల్పి నాయకుడు కుందూరు జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. బీజేపీ, బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ 75 వేల కోట్ల అప్పు చేస్తే.. తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ 5లక్షల 60వేల కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు. అంతేకాకుండా.. దేశంలో తొమ్మిదేళ్లలో 112 లక్షల కోట్లు మోడీ ఖర్చు చేశాడని తెలిపారు. మోడీ, కేసీఆర్ లు చేసిన అవినీతిపై ఒకరిపై ఒకరు మాట్లాడుతున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో మద్యం, డబ్బు లేకుండా పోటీ చేయాలని సవాల్ చేసినా స్వీకరించలేదని జానారెడ్డి తెలిపారు. ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం తన వారసులను తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పార్లమెంట్ బరిలో ఉంటానని అన్నారు. ఇదిలా ఉంటే.. ఉచిత కరెంటు మొదలు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని.. 24 గంటల కరెంటు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని ఆయన తెలిపారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటామని చెప్పారు.

Read Also: Air India: అక్టోబర్ 14 వరకు ఇజ్రాయెల్‌కు విమానాలను రద్దు చేసిన ఎయిరిండియా

ఇదిలా ఉంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలా? పార్లమెంట్ బరిలో నిలవాలా? అనే సందిగ్ధంలో జానారెడ్డి ఉన్నారని తెలుస్తోంది. రోజుకో రకంగా కామెంట్స్ చేస్తున్న ఆయన… తాజాగా నల్గొండ ఎంపీ స్థానానికి పోటీ చేస్తానని అంటున్నారు. జానారెడ్డికి నాగార్జున సాగర్ నియోజకవర్గం కంచుకోట. ఆయన టీడీపీ నుంచి, కాంగ్రెస్ నుంచి రికార్డు విజయాలు సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన తొలి ఎన్నికల్లోనూ ఆయనే గెలుపొంది తెలంగాణ తొలి ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 2018లో జరిగిన ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ.. దివంగత నోముల నర్సింహయ్య తనయుడు నోముల భగత్ చేతిలోనూ ఓడిపోయారు. కాగా.. మరో రెండు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జానారెడ్డి పోటీ చేస్తారా ? చేయరా ? అన్న సంశయం కార్యకర్తల్లో వచ్చింది.