Site icon NTV Telugu

Bihar: బీహార్ కాంగ్రెస్‌లో జోష్.. హస్తం గూటికి పప్పు యాదవ్

Pappu Yadav

Pappu Yadav

సార్వత్రిక ఎన్నికల వేళ బీహార్‌లో ఒక్కసారిగా బలహీన పడ్డ కాంగ్రెస్‌.. ప్రస్తుతం అనూహ్యంగా కొత్త జోష్ వచ్చింది. ప్రాంతీయ పార్టీ అయిన జన్ అధికార్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యింది. కాంగ్రెస్ ముఖ్యనేత ప్రియాంక గాంధీ హామీ మేరకు పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశామని జన్ అధికార్ పార్టీ అధినేత రాజేశ్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ కార్యాలయంలో హస్తం గూటికి చేరారు. ఆయన మెడలో పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి పోటీ చేయడం వల్ల లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని పప్పు యాదవ్ విశ్వాసం వ్యక్తం చేశారు.

లోక్‌సభ ఎన్నికల తర్వాత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి విజయం సాధిస్తోందని పప్పు యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. పప్పు యాదవ్‌ను లోక్‌సభ ఎన్నికల బరిలో నిలుపాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రకటించే మూడో జాబితాలో ఆయన పేరు ఉండొచ్చని సమాచారం.

కాంగ్రెస్ పార్టీలో చేరకముందు ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్, అతని కుమారుడు తేజస్వి యాదవ్‌తో పప్పు యాదవ్ సమావేశం అయ్యారు. తమకు ఒకరిపై మరొకరికి శత్రుత్వం లేదని పప్పు యాదవ్ స్పష్టం చేశారు. బీహార్‌లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తానని పప్పు యాదవ్ ప్రకటించారు. తేజస్వి యాదవ్‌పై ప్రశంసలు కురిపించారు. గత 17 నెలల బీహార్ పాలనలో తేజస్వి యాదవ్ మార్క్ కనిపించిందని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం తేజస్వి యాదవ్ నిరంతరం పని చేశారని పప్పు యాదవ్ కొనియాడారు.

ఇటీవల జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాల కూటమి నుంచి బయటకు వచ్చి.. బీజేపీ మద్దతు మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నితీష్.. ఎన్డీఏ కూటమిలో చేరారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై కూడా క్లారిటీ వచ్చింది. బీజేపీ 17, జేడీయూ 16, చిరాగ్ పాశ్వాన్ పార్టీ 5 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. బీహార్‌లో మొత్తం 40 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Telugu OTT Movies: ఈ వారం ఓటీటీలోకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లివే!

అలాగే ఆర్జేడీ-కాంగ్రెస్ మధ్య కూడా సీట్ల పంపకాలపై ఒక క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఒక ప్రకటన రానుంది. కాంగ్రెస్ ముఖ్య నేతలతో తేజస్వీ యాదవ్ చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్‌కు 12 సీట్లు ఇవ్వొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి:Ariaana Manchu: విష్ణు కూతురిలో ఈ టాలెంట్ ఉందా?.. ఫ్యూచర్ స్టార్ అవ్వడం పక్కా..

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫస్ట్ ఫేజ్ ఏప్రిల్ 19న ప్రారంభం కాగా… జూన్ 1న ఏడో విడత పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. బుధవారం తొలి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.

Exit mobile version