Jammu Kashmir Kishtwar Cloudburst: జమ్మూ కశ్మీర్ కిష్త్వార్‌లోని చోసిటి గ్రామంలో గురువారం భారీ మేఘాల విస్ఫోటం(క్లౌడ్‌బరస్ట్) సంభవించిన విషయం తెలిసిందే. దీంతో సంభవించిన ఆకస్మిక వరదలు, పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించాయి. ఇప్పటి వరకు ఇద్దరు CISF జవాన్లు సహా కనీసం 33 మంది మరణించారు. 120 మందికి పైగా గాయపడ్డారు. బాధితులను కాపాడేందుకు కోసం రెస్క్యూ బృందాలు పరుగులు తీస్తున్నాయి. 220 మందికి పైగా ప్రజలు గల్లంతయినట్లు తెలుస్తోంది. హిమాలయలోని మాతా చండి పుణ్యక్షేత్రానికి వెళ్లే మచైల్ మాతా యాత్ర మార్గంలో ఈ విపత్తు సంభవించింది. దీంతో తీర్థయాత్ర మార్గం మొత్తం గందరగోళంగా మారింది. కిష్త్వార్ ప్రాంతంలో పరిస్థితి గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించానని జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఈ ఘటన జరిగిన ప్రాంతం నుంచి సమాచారం నెమ్మదిగా వస్తోందని సహాయక చర్యల కోసం సాధ్యమైన అన్ని వనరులను సమీకరిస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ అంశంపై ప్రధాని మోడీ స్పందించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
READ MORE: Minister ParthaSarathy: వైసీపీ గెలిస్తేనే.. ప్రజాస్వామ్యాం ఉన్నట్టా..!
ఏమిటీ క్లౌడ్‌బరస్ట్..?
భారత వాతావరణశాఖ (IMD) ప్రకారం.. సాధారణంగా అతి స్వల్ప సమయంలో భారీ వర్షాలకు దారితీయడాన్నే మేఘాల విస్ఫోటము లేదా క్లౌడ్‌బరస్ట్‌గా వ్యవహరిస్తారు. ముఖ్యంగా 20 నుంచి 30చ.కి.మీ పరిధిలో గంటకు 10సెం.మీ (100మి.మీ) వర్షపాతం నమోదవుతుంది. ఒక్కోసారి ఉరుములు, పిడుగులతో ఊహించని స్థాయిలో కురిసే ఈ భారీ వర్షాలు ఆకస్మిక వరదలకు దారితీస్తాయి. స్వల్ప పరిధిలో రెండు గంటల వ్యవధిలోనే 5 సెం.మీ, అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే కూడా దాన్ని మినీ క్లౌడ్‌బరస్ట్‌గా వ్యవహరిస్తారు. అయితే, అన్ని క్లౌడ్‌బరస్ట్‌లు భారీ వర్షాలకు దారి తీస్తాయి.. కానీ, స్వల్ప సమయంలో సంభవించే భారీ వర్షాలన్నింటినీ క్లౌడ్ బరస్ట్‌గా పరిగణించలేం. కొన్ని వాతావరణ పరిస్థితులు ఉంటేనే వాటిని క్లౌడ్ బరస్ట్‌గా పరిగణిస్తారు.