Jaipur: ఇంట్లో చేసిన నూడుల్స్ తిని ఏడేళ్ల చిన్నారి మృతి.. అక్క పరిస్థితి విషమం..

Jaipur Noodles Food Poisoning

Jaipur Noodles Food Poisoning

రాజస్థాన్‌లోని జైపూర్ (Jaipur) నగరంలో జరిగిన ఒక విషాదకర ఘటన ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది. ఇంట్లోనే సరదాగా చేసుకుని తిన్న నూడుల్స్ (Noodles) ఏకంగా ఏడేళ్ల చిన్నారి ప్రాణాలను బలితీసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో చిన్నారి మృతి చెందగా, ఆమె అక్క పరిస్థితి కూడా విషమంగా మారింది.

జైపూర్‌లోని ఝోత్వర (Jhotwara) ప్రాంతం మంగళం సిటీలో నివసించే పీహూ కుమావత్ (7), ఆమె అక్క దివ్యాంశి గురువారం ఉదయం ఇంట్లోనే స్వయంగా నూడుల్స్ తయారు చేసుకుని తిన్నారు. ఆ తర్వాత ఇద్దరూ నిద్రపోయారు. మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చిన వారి తల్లి, నిద్రపోతున్న పిల్లలను లేపేందుకు ప్రయత్నించింది. పెద్దమ్మాయి దివ్యాంశి నిద్రలేచింది కానీ, చిన్నారి పీహూలో ఎలాంటి కదలిక లేదు. దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు వెంటనే ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఏడేళ్ల పీహూ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మరోవైపు దివ్యాంశి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉండటంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. చికిత్స అనంతరం శుక్రవారం ఉదయం దివ్యాంశి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న కర్ధాని పోలీస్ స్టేషన్ (Kardhani Police Station) సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తులో ఇది ఫుడ్ పాయిజనింగ్ వల్లే జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించడంతో పాటు, పిల్లలు తిన్న నూడుల్స్ శాంపిల్స్‌ను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు (Lab) పంపించారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అసలే కష్టాల్లో ఉన్న ఈ కుటుంబంపై ఈ ఘటన మరింత పిడుగులా పడింది. మృతి చెందిన పీహూ సోదరుడు గోవింద్ గత రెండు నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పుడు ఉన్నట్టుండి కుమార్తె కూడా దూరమవడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.