Site icon NTV Telugu

Jagan: ‘ఎందుకీ ఆంక్షలు? అసలు మీరు మనుషులేనా?’.. ప్రభుత్వంపై జగన్ ఫైర్..!

Jagan

Jagan

మామిడి రైతులను నిరంకుశంగా నియంత్రించారని.. మామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ సీఎం జగన్ అన్నారు. చిత్తూరు పర్యటనలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు ఇక్కడికి వచ్చానని తెలిపారు. జగన్‌ వస్తున్నాడని తెలిసి, ఇక్కడ 2 వేల మంది పోలీసులను మొహరించి, రైతులను రానివ్వకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. రైతులు ఇక్కడికి రాకుండా బెదిరించారని.. చివరకు టూవీలర్లపై వచ్చిన వారిని కూడా అడ్డుకున్నారన్నారు. ఇక్కడికి కేవలం 500 మంది మాత్రమే రావాలని ఎందుకు అన్నారు. ఎందుకీ ఆంక్షలు? అని ప్రశ్నించారు. అయినా ఇక్కడికి వేల మంది రైతులు వచ్చి, వారి ఆవేదన చెప్పుకున్నారని.. ఏ పంటకు కనీస గిట్టుబాటు ధర లేదన్నారు. వరికి కూడా ధర లేదని.. కనీసం రూ.300కు తక్కువకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. వరి, పెసర, జొన్న.. చివరకు మామిడి రైతులకు కూడా కనీస గిట్టుబాటు ధర రావడం లేదని.. ఒక్క మన రాష్ట్రంలో తప్ప, వేరే రాష్ట్రంలో అయినా కిలో మామిడి రూ.2కి దొరుకుతుందా? అని ప్రశ్నించారు.

READ MORE: ENG vs IND: 9 పరుగులే.. కెప్టెన్‌గా చరిత్ర సృష్టించనున్న శుభ్‌మన్ గిల్!

ఈ ప్రభుత్వానికి నా సూటి ప్రశ్న. ఎందుకు ధర లేదు? అని జగన్ ప్రశ్నించారు. ఇదే మామిడికి మా ప్రభుత్వ హయాంలో కిలో రూ.22 నుంచి రూ.29 వరకు అమ్ముకున్నారని గుర్తు చేశారు. కొనుగోళ్లలో ఎందుకంత జాప్యం? అని చంద్రబాబు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.. “ఏటా మామిడి కొనుగోలు ఉంటుంది. దాన్ని మే మొదటి వారంలో మొదలుపెట్టాలి. కానీ, ఆ పని ఎందుకు చేయలేదు? జూన్‌ రెండో వారం తర్వాత మామిడి కొనుగోలు చేయడంతో.. మొత్తం పంట మార్కెట్‌ను ముంచెత్తింది. దీంతో కంపెనీలు ధరలు తగ్గించాయి. దీంతో మామిడి రైతులకు దిక్కు తోచడం లేదు. చిత్తూరు జిల్లాలో 52 పల్ప్‌ కంపెనీలు ఉన్నాయి. కానీ రైతులకు ధర రావడం లేదు. నిజంగా ఆ ధరకు ఎంత పంట కొన్నారు. కానీ, ఈ ప్రభుత్వం కంపెనీలు కిలోకు రూ.8 ఇస్తుంటే, ప్రభుత్వం మరో రూ.4 చొప్పున ఇస్తోందని చెబుతున్నారు. మరి ఇక్కడ ఆ ధరకు ఎంత పంట అమ్ముడుపోయింది. అదే పొరుగున్న ఉన్న కర్ణాటకలో కుమారస్వామి కేంద్రానికి లేఖ రాస్తే.. కిలో మామిడి రూ.16 చొప్పున కొన్నారు. ఇక్కడ 76 వేల మంది రైతులు మామిడి సాగుమీద బతుకున్నారు. 6.45 లక్షల టన్నుల పంట పండింది. ఇక్కడ 2.20 లక్షల ఎకరాల్లో మామిడి సాగు చేశారు. నాడు కిలో రూ.29. మరి నేడు? మా ప్రభుత్వ హయాంలో కిలో మామిడి రూ.29 కి కొంటే, ఇప్పుడు కనీసం రూ.12 కూడా రావడం లేదు. ఇంకా రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా అందడం లేదు. నాడు ఆర్బీకే వ్యవస్థ ప్రతి అడుగులో రైతులకు తోడుగా ఉండేవి. కానీ, ఈ ప్రభుత్వం ఆ వ్యవస్థను నిర్వీరం చేసింది. ఇవాళ అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వదలాలి. మొత్తం పంటను ప్రభుత్వం స్వయంగా కొనుగోలు చేసి, మామిడి రైతులను ఆదుకోవాలి. లేని పక్షంలో రైతుల పక్షాన నిలబడి పోరాడుతాం. ఇదే నా హెచ్చరిక. అసలు మీరు మనుషులేనా?. ప్రభుత్వం ఇంత క్రూరంగా వ్యవహరిస్తోంది. ఎందుకు రైతులను రానీయకుండా అడ్డుకుంటోంది? దాదాపు 1200 మంది రైతులను అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ ఒకరి తల పగలగొట్టారు. అసలు మీరు మనుషులేనా? ఎవరికి ఏ సమస్య వచ్చినా జగన్‌ పలుకుతున్నాడు. మిర్చి, పొగాకు, మామిడి రైతుల సమస్యలపై జగన్‌ మాత్రమే మాట్లాడుతున్నాడు. ఇంకా ఎవరికి ఏ సమస్య వచ్చినా, జగన్‌ ముందు ఉంటున్నాడు. వచ్చేది జగన్‌ ప్రభుత్వమే. ఇది గుర్తు పెట్టుకోండి.” అని జగన్ వ్యాఖ్యానించారు.

 

Exit mobile version