బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. ప్రత్యర్థి ఆసీస్‌పై అన్ని విభాగాల్లోనూ పూర్తి ఆధిపత్యం వహించిన రోహిత్‌సేన ఇన్నింగ్స్ 132 రన్స్ తేడాతో గెలిచి నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. టీమిండియా స్పిన్నర్లు అశ్విన్ 8 (తొలి ఇన్నింగ్స్‌లో 3, రెండో ఇన్నింగ్స్‌లో 5), జడేజా 7 (తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్స్‌లో 2) వికెట్లతో రెచ్చిపోవడంతో ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 91 రన్స్‌కే తోకముడిచింది. ఇక బ్యాటింగ్‌లో కెప్టెన్ రోహిత్ (120), అక్షర్ పటేల్ (84), జడేజా (70) సూపర్ బ్యాటింగ్‌తో ఈ మ్యాచ్‌లో హీరోలుగా నిలిచారు. కాగా, టాస్ గెలవడంతో పాటు అరంగేట్ర స్పిన్నర్ టాడ్ మర్ఫీ 7 వికెట్ల ఘనత మాత్రమే ఈ మ్యాచ్‌లో ఆసీస్‌కు చెప్పుకోదగ్గ విషయాలు.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. భారత స్పిన్నర్లు రెచ్చిపోవడంతో తొలి ఇన్నింగ్స్‌లో 177 రన్స్‌కే చాప చుట్టేసింది. ఓవైపు జడేజా, మరోవైపు అశ్విన్ ప్రత్యర్థి బ్యాటర్లపై దండయాత్ర చేయడంతో కంగారూలకు కంగారు పుట్టింది. లబుషేన్ (49) మాత్రమే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. స్టీవ్ స్మిత్ (37), అలెక్స్ కారే (36) కాసేపు పోరాడారు. మిగతా బ్యాటర్ల నుంచి కనీస పోరాటం కరువైంది. ఇక, గాయం కారణంగా కొన్ని నెలలపాటు ఆటకు దూరమైన జడేజా రీఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ అంతర్జాతీయ మ్యాచ్‌లోనే ఐదు వికెట్లతో రెచ్చిపోయాడు. అశ్విన్ మూడు వికెట్లతో మెరిశాడు.
రోహిత్ సెంచరీ, జడేజా, అక్షర్ సూపర్ బ్యాటింగ్
ఆస్ట్రేలియాను మొదట తక్కువ రన్స్‌కే ఆలౌట్ చేసిన భారత జట్టు.. అనంతరం బ్యాటింగ్‌కు దిగి 400 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రోహిత్ శర్మ (120) సెంచరీతో రెచ్చిపోగా.. అక్షర్ పటేల్ (84), రవీంద్ర జడేజా (70) హాఫ్ సెంచరీలతో అలరించారు. మొదటి నుంచే పిచ్ స్పిన్నర్లు అనూకూలించగా రోహిత్ మాత్రం అందరికీ భిన్నంగా బ్యాటింగ్ చేశాడు. సహచర ఆటగాళ్లు రాహుల్ (20), పుజారా (7), కోహ్లీ (12), సూర్యకుమార్ (8), భరత్ (8) పూర్తిగా విఫలమైన వేళ హిట్‌మ్యాన్ మాత్రం ఎక్కడా సహనం కోల్పోలేదు. ప్రత్యర్థి బౌలర్లకు బ్యాట్‌తోనే సమాధానం చెబుతూ సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. ఇతడికి తోడు చివర్లో అక్షర్ పటేల్, జడేజా హాఫ్ సెంచరీలతో మెరవడంతో మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 223 రన్స్ ఆధిక్యం లభించింది.
పేకమేడలా కుప్పకూలిన ఆసీస్
మొదటి ఇన్నింగ్స్‌లో కాసేపైనా పోరాడిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం చేతులెత్తేసింది. స్పినర్లు అశ్విన్, జడేజా దెబ్బకు 91 పరుగులకే చాపచుట్టేసింది. అదే పిచ్‌పై అప్పటిదాకా భారత బ్యాటర్లు గొప్పగా పోరాడగా.. ఆసీస్ మాత్రం కనీస పోరాటం చేయలేకపోయింది. ఓపెనర్లు ఖవాజా (5), వార్నర్ (10)తో పాటు లబుషేన్ (17), రెన్‌షా (2), హ్యాండ్స్‌కాంబ్ (6), అలెక్స్ కారే (10) ఇలా వరుసపెట్టి వికెట్లు సమర్చించుకోవడంతో 64 రన్స్‌కే ఆసీస్ కీలక ఆరు వికెట్లు కోల్పోయింది. ఓ ఎండ్‌లో వరుస వికెట్లు పడుతున్నా స్టీవ్ స్మిత్ (25 నాటౌట్) మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. మర్ఫీ (2), లియోన్ (8) ఎక్కువ సేపు నిలవలేదు. ఇక చివరి వికెట్ కోసం ఇండియా కాస్త శ్రమించాల్సి వచ్చింది. జడేజా బౌలింగ్‌లో స్మిత్ 23 రన్స్ వద్ద క్లీన్ బౌల్డ్ అవడంతో టీమిండియా శిబిరంలో గెలుపు సంబరాలు చేసుకున్నారు. కానీ థర్డ్ అంపైర్ దాన్ని నోబాల్‌గా ప్రకటించడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. అయినా కాసేపటికే బోలాండ్ (0)ను షమీ ఔట్ చేయడంతో భారత్ గెలుపు ఖాయమైంది. ఈ ఇన్నింగ్స్‌లో అశ్విన్ 5 వికెట్లతో రెచ్చిపోగా, జడేజా, షమీ చెరో రెండు, అక్షర్ ఒక వికెట్ దక్కించుకున్నారు.