NTV Telugu Site icon

Congress: సూరత్ అభ్యర్థి మిస్సింగ్.. ఈసీకి కాంగ్రెస్ ఏం ఫిర్యాదు చేసిందంటే..!

Coeme

Coeme

సూరత్ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ను వాయిదా వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. సూరత్ కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభానీ కొన్ని గంటల నుంచి కనిపించడం లేదని ఈసీకి తెలిపింది. తక్షణమే పోలింగ్ నిలిపివేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

ఇది కూడా చదవండి: Buggana Rajendranath: మీకు అభివృద్ధి అంటే అర్థం తెలుసా?.. కోట్ల, కె.యి లపై ఫైర్

సోమవారం సూరత్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ విజయం సాధించినట్లుగా రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభానీ నామినేషన్ పత్రం ఆదివారం తిరస్కరణకు గురైంది. నామినేషన్ పత్రంలో సంతకాల్లో అవకతవకలు జరిగాయని రిటర్నింగ్ అధికారి డిస్‌క్వాలిఫై చేశారు. మరో కాంగ్రెస్ ప్రత్యామ్నాయ అభ్యర్థిగా ఉన్న సురేష్ పడసాల నామినేషన్ ఫారం కూడా తిరస్కరణకు గురైంది. ఆయన నామినేషన్ పత్రం కూడా చెల్లదని రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. ఇక సోమవారం స్వతంత్రులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ తమ నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకున్నారు. దీంతో బీజేపీ అభ్యర్థి ఒక్కరే బరిలో ఉండడంతో ఆయనే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఈ మేరకు బీజేపీ కూడా ఎక్స్‌లో పోస్టు చేస్తూ బీజేపీ తొలి విజయం అని వెల్లడించింది. బీజేపీ నేతలంతా అభ్యర్థికి అభినందనలు తెలిపారు.

ఇది కూడా చదవండి: Botsa Jhansi Lakshmi: విశాఖలో బొత్స ఝాన్సీ లక్ష్మి నామినేషన్ దాఖలు

సూరత్ పరిణామాలను చూస్తుంటే ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందన్న సంగతి అర్థమవుతుందని ఎక్స్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ పోస్టు చేశారు. ప్రజాస్వామ్యానికి, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి ముప్పు పొంచి ఉందని జైరాం రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి విడత ఏప్రిల్ 19న ముగిసింది. సెకండ్ విడత శుక్రవారం జరగనుంది. అనంతరం మే 7, 13, 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. ఇంకా ఆరు విడతల పోలింగ్ ముగియక ముందే సూరత్‌లో విజయం సాధించినట్లుగా బీజేపీ ప్రకటించింది. సూరత్ ఎన్నిక ఏకగ్రీవం కావడంతో మే 7న ఇక పోలింగ్ జరగదు.