ITR Documents Chek List: 2022-23 ఆర్థిక సంవత్సరం ముగిసింది. 2023-24 అసెస్‌మెంట్ ఇయర్ ప్రారంభమైంది. దీంతో.. ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్‌కి.. అంటే.. ఐటీఆర్ సమర్పణకు సమయం ఆసన్నమైందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో.. అసలు ఐటీఆర్ ఎన్ని రకాలు?, వాటికి ఎలాంటి డాక్యుమెంట్లు జతపరచాలి అనే విషయాలను తెలుసుకుందాం.
read more: Super Success Story: ప్రతిఒక్కరూ చూడాల్సిన ప్రత్యేక ఇంటర్వ్యూ. వహ్‌వా అనిపించే విజయగాథ
ఐటీఆర్ అనేది ముఖ్యంగా ఏడు రకాలు. ఐటీఆర్-వన్‌ని సహజ్ అని, ఐటీఆర్-ఫోర్‌ని సుగమ్ అని కూడా అంటారు. ఏడాదికి 50 లక్షల రూపాయలు లేదా అంతకన్నా తక్కువ ఆదాయం వచ్చేవాళ్లు ఐటీఆర్-వన్ పరిధిలోకి వస్తారు. శాలరీ లేదా పెన్షన్, సింగిల్ హౌజ్ ప్రాపర్టీ మరియు ఇతరత్రా మార్గాల ద్వారా ఆదాయం వచ్చేవాళ్లు ఈ ఐటీఆర్ సబ్మిట్ చేయాలి. ఒక వేళ అగ్రికల్చరల్ ఇన్‌కం గనక 5 వేల రూపాయల వరకు వస్తుంటే.. వాళ్లు కూడా ఐటీఆర్-1 దాఖలుచేయొచ్చు. దీనికోసం.. ఫామ్-16, ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ అంటే టీడీఎస్.. సర్టిఫికెట్, బ్యాంక్ స్టేట్మెంట్లు ఎటాచ్ చేయాలి.
వార్షికాదాయం 50 లక్షల రూపాయల కన్నా ఎక్కువ వచ్చే వ్యక్తులు లేదా హిందూ అవిభాజ్య కుటుంబం ఐటీఆర్-2 పరిధిలోకి వస్తుంది. మూలధన లాభాలు, మల్టిపుల్ హౌజ్ ప్రాపర్టీస్, ఫారన్ అసెట్స్, కంపెనీలో డైరెక్టర్‌షిప్, అన్‌లిస్టెడ్ ఈక్విటీ షేర్లు కలిగినవాళ్లు ఈ రెండో కేటగిరీలో ఐటీఆర్ సమర్పించాలి. సెక్షన్ 194-ఎన్ ప్రకారం కోటి రూపాయల కంటే ఎక్కువ క్యాష్ విత్‌డ్రా చేసినందుకు ట్యాక్స్ చెల్లించేవాళ్లు సైతం ఇదే కోవలోకి వస్తారు. ఇందులోభాగంగా ఫామ్-16, ఫామ్-16ఏ, క్యాపిటల్ గెయిన్స్ వివరాలు, బ్యాంక్ స్టేట్మెంట్లు జతపరచాలి.
వ్యాపారం చేసేవాళ్లు లేదా వృత్తిలో నిమగ్నమైనవాళ్లు ఐటీఆర్-3 కిందికి వస్తారు. కంపెనీలో డైరెక్టర్ లేదా అన్‌లిస్టెడ్ ఈక్విటీ షేర్లలో ఇన్వెస్టర్, బిజినెస్‌లో పార్ట్నర్‌గా ఉన్నవాళ్లను ఈ మూడో కేటగిరీలో పరిగణనలోకి తీసుకుంటారు. హౌజ్ ప్రాపర్టీ, శాలరీ లేదా పెన్షన్ మరియు ఇతరత్రా మార్గాల్లో ఆదాయం వచ్చేవాళ్లను కూడా ఇందులో చేర్చొచ్చు. వీళ్లందరు ఐటీఆర్‌తోపాటు అకౌంట్ బుక్కులు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వివరాలు, ఫామ్-16, ఫామ్-16ఏ మరియు క్యాపిటల్ గెయిన్స్ డిటెయిల్స్ సమర్పించాలి.
సెక్షన్-44ఏడీ లేదా సెక్షన్-44ఏఈ ప్రకారం 2 కోట్ల రూపాయల వరకు వ్యాపార ఆదాయం వచ్చే వాళ్లు మరియు సెక్షన్-ఏడీఏ ప్రకారం 50 లక్షల వరకు వృత్తిపరమైన ఆదాయం వచ్చేవాళ్లు.. శాలరీ, పెన్షన్, సింగిల్ హౌజ్ ప్రాపర్టీ, ఇతరత్రా ఏదైనా ఒక మార్గంలో 50 లక్షల వరకు ఇన్‌కం పొందేవాళ్లను ఐటీఆర్-4 కింద పరిగణనలోకి తీసుకుంటారు. వీళ్లు.. ఫామ్-16, ఫామ్-16ఏ మరియు బ్యాంక్ స్టేట్మెంట్లు ఎటాచ్ చేయాలి.
సంస్థలు, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, బాడీ ఆఫ్ ఇండివిడ్యువల్స్, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్‌షిప్స్, ఆర్టిఫిషియల్ జ్యుడీషియల్ పర్సన్, LLP పరిధిలోకి రాని కంపెనీలు మరియు ఐటీ చట్టంలోని సెక్షన్-11 ప్రకారం మినహాయింపు పొందని సంస్థలకు ఐటీఆర్-5 వర్తిస్తుంది. వీళ్లు.. అకౌంట్ బుక్కులు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వివరాలు, టీడీఎస్ సర్టిఫికెట్, బ్యాంక్ స్టేట్మెంట్స్‌ను ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్‌కి జతచేయాలి.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్-11 ప్రకారం మినహాయింపు పొందని సంస్థలు ఐటీఆర్-6 కింద ఐటీఆర్‌ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ కంపెనీలు కూడా అకౌంట్ బుక్కులు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వివరాలు, టీడీఎస్ సర్టిఫికెట్, బ్యాంక్ స్టేట్మెంట్స్‌ను ఐటీఆర్ ఫామ్‌తోపాటు ఎటాచ్ చేయాలి. సెక్షన్ 139(4ఏ), 4బీ, 4సీ, 4డీ కిందికి వచ్చేవాళ్లను ఐటీఆర్-7 కేటగిరీ లాగా పేర్కొనొచ్చు. వీళ్లు.. అవసరమైతే ఆడిట్ రిపోర్ట్, టీడీఎస్ సర్టిఫికెట్, బ్యాంక్ స్టేట్మెంట్స్ సమర్పించాలి.