NTV Telugu Site icon

Aditya L-1 Mission: సూర్యుడిపై అధ్యయనానికి ఇస్రో రెడీ.. సెప్టెంబర్‌ 2న ఆదిత్య ఎల్‌1 ప్రయోగం

Aditya

Aditya

Aditya L-1 Mission: చంద్రుడిపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ కావడంతో ఇస్రో ఉత్సాహంగా ఉంది. చంద్రుడిపై సక్సెస్‌ సాధించిన ఇస్రో ఇప్పుడు సూర్యుని గురించి అధ్యయనం చేయడానికి ఒక వారంలోపు సోలార్ మిషన్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.ఇస్రో సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 సోలార్ మిషన్‌ను ప్రారంభించనుంది. సూర్యుడి పుట్టుక, అక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు ఇస్రో ఆదిత్య ఎల్‌-1 ప్రయోగాన్ని చేపడుతోంది. దీనిని భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్రేజ్ పాయింట్-1 (L-1)దగ్గర ఉండే సుదీర్ఘమైన దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి చేరుస్తారు. 177 రోజుల ప్రయాణం తర్వాత ఆదిత్య ఎల్-1 ఈ కక్ష్యలోకి చేరుతుంది. ఈ ఉపగ్రహం ద్వారా అతి దగ్గరి నుంచి సౌర వ్యవస్థపై నిఘా పెట్టి సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణం, సౌర తుఫానులపై అధ్యయనం చేయవచ్చు. సౌర తుఫాన్ సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు ఒక అంచనా వేశారు. దీంతోపాటు కాంతిమండలం(ఫొటోస్పియర్),వర్ణ మండలం(క్రోమోస్పియర్)పై అధ్యయనం చేసి సమాచరాన్ని సేకరించాలని ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారు.

Read Also: Russia: రష్యా విమానం ప్రమాదం.. 10 మృతదేహాలు, ఫ్లైట్‌ రికార్డర్‌లు వెలికితీత

ప్రస్తుతం ఆదిత్య ఎల్-1 శ్రీహరికోట స్పేస్‌పోర్ట్‌లో ఉందని ఇస్రో పేర్కొంది. అన్నీ సవ్యంగా సాగితే సెప్టెంబర్ మొదటి వారంలో ఉపగ్రహాన్ని ప్రయోగించే అవకాశం ఉంది. ఈ మిషన్ తర్వాత, సూర్యుడిపైకి ఉపగ్రహాన్ని పంపిన ప్రపంచంలో నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది. గతంలో అమెరికా, జర్మనీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు సూర్యునిపైకి ఉపగ్రహాలను పంపాయి. ఆదిత్య ఎల్‌-1 సిద్ధమైందని, ప్రయోగానికి సిద్ధంగా ఉందని అహ్మదాబాద్‌లోని ఇస్రో స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ డైరెక్టర్‌ నీలేశ్‌ ఎం దేశాయ్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి సెప్టెంబర్‌ 2న ఆదిత్య ఎల్‌-1ను మోసుకుంటూ పీఎస్‌ఎల్వీ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్తుందని ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక అంశాలను నీలేశ్‌ ఎం దేశాయ్‌ వివరించారు.

సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు భారత్‌ పంపిస్తున్న తొలి అబ్జర్వేటరీ స్పేస్‌క్రాఫ్ట్‌ ఇదే కావడం విశేషం. దీని ద్వారా సూర్య వ్యవస్థ గురించి ముఖ్యమైన వివరాలు తెలుస్తాయి. ఇందులో మొత్తం ఏడు పే లోడ్లు ఉంటాయి. వీటిలో విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కొరోనాగ్రాఫ్‌ పేలోడ్‌ ద్వారా సూర్యుడి చిత్రాలు, స్పెక్ట్రోస్కోపిపై దృష్టి సారించవచ్చు. దీని ద్వారా సూర్యుడికి ఎక్కడి నుంచి శక్తి లభిస్తుందో మరింతగా తెలుసుకోవచ్చు.

Show comments