Israel vs Muslim World: మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు ఇప్పుడు కొత్త మలుపు తిరిగాయి. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో పాలస్తీనియన్లకు మరణశిక్ష విధించేలా ఇజ్రాయెల్ పార్లమెంట్ (క్నెస్సెట్) ఆమోదించిన నూతన చట్టంపై ముస్లిం ప్రపంచం భగ్గుమంది. ఈ చట్టాన్ని తీవ్రంగా ఖండిస్తూ పాకిస్థాన్, టర్కీ, ఈజిప్ట్ సహా ఏడు కీలక ముస్లిం దేశాలు ఒక ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి. పాకిస్థాన్, టర్కీ, ఈజిప్ట్, ఇండోనేషియా, జోర్డాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) దేశాల విదేశాంగ మంత్రులు ఈ సంయుక్త ప్రకటనపై సంతకాలు చేశారు.
READ ALSO: Allu Arjun : కౌంట్‌డౌన్ స్టార్ట్.. వచ్చే వారమే అల్లు ఫెస్ట్
పాలస్తీనియన్ల అణచివేతకే ఈ చట్టం..
ఇజ్రాయెల్ తీసుకొచ్చిన ఈ చట్టం అంతర్జాతీయ చట్టాలకు, ప్రాథమిక మానవ హక్కులకు పూర్తి విరుద్ధమని వారు స్పష్టం చేశారు. ఈ చట్టం మధ్యప్రాచ్యంలో శాంతి ప్రక్రియను పూర్తిగా దెబ్బతీస్తుందని, ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు కలిగిస్తుందని వారు హెచ్చరించారు. ఈ కొత్త చట్టాన్ని పాలస్తీనియన్లకు వ్యతిరేకంగా ఒక ఆయుధంగా ఇజ్రాయెల్ ఉపయోగించే ప్రమాదం ఉందని ఆ ఏడు దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. వెస్ట్ బ్యాంక్‌లో నివసిస్తున్న పాలస్తీనియన్లను లక్ష్యంగా చేసుకుని, వారిని వివక్షాపూరితంగా శిక్షించేందుకు ఈ చట్టాన్ని ముసుగులా వాడుకోవచ్చని పేర్కొన్నాయి. ఇజ్రాయెల్ విధానాలు పాలస్తీనా ఉనికికే సవాలు విసురుతున్నాయని, ఇది అణచివేతకు పరాకాష్ట అని ఆరోపించాయి.
ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనా ఖైదీల దుస్థితిపై కూడా ఈ సంయుక్త ప్రకటనలో ముస్లిం దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఖైదీలపై జరుగుతున్న అమానుష దాడులను ఈ దేశాలు ఎండగట్టాయి. ఇజ్రాయెల్ జైళ్లలో ఖైదీలను చిత్రహింసలకు గురి చేయడం, ఆహార కొరత సృష్టించడం జరుగుతుందన్నారు. ఇది కేవలం కొన్ని చోట్ల జరుగుతున్న సంఘటనలు కాదని, పాలస్తీనియన్లను క్రమపద్ధతిలో వేధించే వ్యూహంలో భాగమని ఆ దేశాలు నొక్కి చెప్పాయి. ఇజ్రాయెల్ ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడాలని ఈ ముస్లిం దేశాలు డిమాండ్ చేశాయి. ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం వెంటనే జోక్యం చేసుకోవాలన్నాయి. ప్రస్తుతం ఈ సంయుక్త ప్రకటన ప్రపంచ వేదికపై చర్చనీయాంశంగా మారింది. ఈ హెచ్చరికలపై ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
READ ALSO: Tina Ambani: అంబానీ కుటుంబంలో విషాదం.. కన్నీళ్లు పెట్టుకున్న టీనా అంబానీ