Site icon NTV Telugu

US: ఇజ్రాయెల్ వైఖరిని తప్పుపట్టిన అమెరికా.. జో బైడెన్ ఘాటు వ్యాఖ్యలు

Jeo

Jeo

గాజాపై ఇజ్రాయెల్ జరిగిస్తున్న మారణహోమాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు తప్పు చేస్తున్నారని విమర్శించారు. ఆయన వైఖరిని ఏ మాత్రం అంగీకరించబోమని తేల్చి చెప్పారు. ఆరు లేదా ఎనిమిది వారాల పాటు తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని ఇజ్రాయెల్‌ను కోరారు. ఈ సమయంలో శరణార్థులకు ఆహారం, ఔషధాలను సరఫరా చేయొచ్చు అని జో బైడెన్ చెప్పుకొచ్చారు.

గత వారం జరిగిన డ్రోన్‌ దాడిలో వరల్డ్‌ కిచెన్‌ సెంటర్‌ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్న ఏడుగురు మరణించారు. ఈ ఘటనపై అగ్రరాజ్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జోర్డాన్‌, సౌదీ, ఈజిప్ట్‌ దేశాలు కూడా సహాయం, ఆహారం పంపేలా నిత్యం వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు బైడెన్‌ తెలిపారు. వారు కూడా దీనికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. గాజాలోని ప్రజలకు ఔషధాలు, ఆహార సరఫరాలో ఎటువంటి రాజీ ఉండదని చెప్పారు. మరోవైపు శ్వేతసౌధం స్పందిస్తూ సంధి కోసం ఇజ్రాయెల్‌ కొన్ని చర్యలు తీసుకొందని వెల్లడించింది. కానీ హమాస్‌ వైపు స్పందన మాత్రం అంత ప్రోత్సాహకరంగా లేదని పేర్కొంది. ఇజ్రాయెల్‌ ప్రభుత్వం దీనిపై స్పందిస్తూ అమెరికా, ఐక్య రాజ్య సమితి డిమాండ్‌ చేసిన విధంగానే గాజాలోకి సరఫరాలను పెంచామని వివరించింది. తాము వీటికి ఎటువంటి ఆటంకాలను సృష్టించడం లేదని తెలిపింది. సోమవారం 468 ట్రక్కులు, మంగళవారం 419 ట్రక్కుల సామగ్రిని తరలించినట్లు చెప్పింది.

ఇది కూడా చదవండి: MI vs RCB: నా జీవితంలోనే ఎప్పుడూ పుస్తకం చదవలేదు.. కానీ ఇప్పుడు తప్పలేదు: సూర్యకుమార్‌

సిరియా కేంద్రంగా పనిచేస్తున్న లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా స్థావరాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. బుధవారం ఉదయం జరిపిన ఈ వైమానిక దాడుల్లో కీలక స్థావరాలు, సైనిక మౌలికవసతులను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ విడుదల చేసింది.

ఇక తాజాగా జరిపిన దాడుల్లో హమాస్‌ ముఖ్యనేత ఇస్మాయిల్‌ హనియేష్ కుమారులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇస్మాయిల్ తీవ్ర షాక్‌కు గురయ్యారు. పగ, ప్రతీకారాలతో తన ముగ్గురు పిల్లలను మరో ముగ్గురు మనవళ్లను ఇజ్రాయెల్‌ అత్యంత దారుణంగా హత్య చేసిందని ఇస్మాయిల్‌ వాపోయారు. చట్టాలను, విలువలను ఏ మాత్రం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. జెరూసలెం, అల్‌ అక్సా మసీదును విముక్తి చేసే పనిలో తన కుమారులు అమరులయ్యారని ఆయన తెలిపారు. తన పిల్లలను చంపినంత మాత్రాన పాలస్తీనా విషయంలో తన వైఖరి మారదని తేల్చిచెప్పారు.

ఇది కూడా చదవండి: DK Shivakumar: ఎన్నికల వేళ షాక్.. డీకేకు లోకాయుక్త నోటీసులు

ఇస్మాయిల్‌ ప్రస్తుతం ఖతార్‌లో ప్రవాసజీవితం గడుపుతున్నారు. కుమారులు మాత్రం గాజాలోని శరణార్థి శిబిరంలో ఉంటున్నారు. షాటీ శరణార్ధి శిబిరంపై జరిపిన దాడిలోనే ఆయన కుమారులు హజీమ్, అమీర్, మొహమ్మద్‌లు మరణించారని స్థానిక మీడియా వెల్లడించింది. ముగ్గురూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఒకే వాహనంలో వెళ్తుండగా ఇజ్రాయెల్‌ డ్రోన్‌ దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురితోపాటు హజీమ్‌ కుమారులు, కుమార్తె, అమీర్‌ కుమార్తె సైతం ప్రాణాలు కోల్పోయారు.

ఇది కూడా చదవండి: Sanju Samson: ఓటమి తర్వాత.. అందుకు కారణాలు చెప్పడం చాలా కష్టం: సంజూ

Exit mobile version