Bombay High Court: ఎలాంటి లైంగిక ఉద్దేశం లేకుండా మైనర్ బాలిక వీపు, తలపై చేయి కదిలించడం ఆమె నిరాడంబరతను అతిక్రమించినట్లు కాదని, 28 ఏళ్ల యువకుడి శిక్షను రద్దు చేస్తూ బొంబాయి హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ వ్యాఖ్యానించింది. ఈ కేసు 2012 నాటిది, అప్పుడు 18 ఏళ్ల వయస్సు ఉన్న దోషి, 12 ఏళ్ల బాలిక అణకువను అతిక్రమించాడనే ఆరోపణలపై కేసు నమోదు చేయబడింది.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు తన వీపుపై, తలపై చేయి వేసి నిమిరాడని పేర్కొంది. న్యాయమూర్తి భారతి డాంగ్రేతో కూడిన సింగిల్ బెంచ్ ధర్మాసనం.. అతడికి ఎలాంటి లైంగిక ఉద్దేశం లేదని, అతను బాధితురాలిని చిన్న పిల్లలా చూశాడని పేర్కొంది. ఆ బాలిక కూడా అతడి వైపు నుంచి ఎటువంటి చెడు ఉద్దేశం గురించి మాట్లాడలేదని.. కానీ ఆమె చెడుగా భావించిందని న్యాయమూర్తి ఫిబ్రవరి 10న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బాలికపై ఆ వ్యక్తి లైంగికంగా వేధించినట్లు ప్రాసిక్యూషన్ మెటీరియల్‌ను సమర్పించడంలో విఫలమైందని హైకోర్టు పేర్కొంది.
Read Also: Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ
ప్రాసిక్యూషన్ ప్రకారం.. మార్చి 15, 2012 న, అప్పుడు 18 ఏళ్ల వయస్సు ఉన్న ఓ వ్యక్తి, కొన్ని పత్రాలను ఇవ్వడానికి బాధితురాలి ఇంటికి ఒంటరిగా ఉన్నప్పుడు సందర్శించారు. ఆపై అతను ఆమె వీపు, తలను తాకి, ఆమె పెరిగి పెద్దదైందని చెప్పాడు. బాలిక అసౌకర్యానికి గురై సహాయం కోసం అరిచినట్లు ప్రాసిక్యూషన్ పేర్కొంది. గతంలో ట్రయల్ కోర్టులో అతడు దోషిగా నిర్ధారించబడ్డాడు. ట్రయల్ కోర్టు అతడికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుపై ఆ వ్యక్తి హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశాడు. విచారణలో ప్రాథమికంగా ఎలాంటి లైంగిక ఉద్దేశం లేని ఆకస్మిక చర్యగా కనిపించడంతో ట్రయల్ కోర్టు తప్పు చేసిందని హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.