Site icon NTV Telugu

Iran-US Talks: ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. పాకిస్థాన్‌లో అమెరికాతో శాంతి చర్చలకు డుమ్మా!

Us Iran

Us Iran

Iran-US Talks in Islamabad: ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌ వేదికగా జరగనున్నాయి. ఈ చర్చలు ఏప్రిల్ 11, 2026 (శనివారం) నాడు ప్రారంభం కానున్నాయి. పాకిస్థాన్‌లో అమెరికా, ఇరాన్‌ల మధ్య జరగనున్న కీలక చర్చల ఫలితంపై మధ్యప్రాచ్యంలోని లక్షలాది మంది ప్రజల జీవితాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవితవ్యం ఆధారపడి ఉన్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరు దేశాల మధ్య జరుగతున్న తొలి చర్చలు ఇవి. ఇప్పటికే ఈ చర్చల కోసం పాకిస్థాన్ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పా్టుల చేసింది. ఆకస్మికంగా రెండు రోజుల ప్రభుత్వ సెలవు సైతం ప్రకటించింది. దీంతో రాజధాని ఇస్లామాబాద్ వీధులు నిర్మానుష్యంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. లెబనాన్‌పై తేల్చే వరకు చర్చలు లేవని ఇరాన్ భీష్మించుకుంది. లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు ఆపేవరకు చర్చలకు వెళ్లమని మరోసారి స్పష్టం చేసింది.

READ MORE: Minister Ponnam Prabhakar: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ తీపికబురు..

అమెరికా ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు ఇరాన్ ఉన్నతాధికారులు పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌కు వెళ్లారంటూ వస్తున్న వార్తలను ఇరాన్ అధికారిక మీడియా సంస్థ ‘ప్రెస్ టీవీ’ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ ప్రచురించిన కథనాన్ని తస్నీమ్ వార్తా సంస్థ ఉటంకిస్తూ ఇరాన్ కొట్టిపారేసింది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆగిపోయే వరకు, కాల్పుల విరమణ విషయంలో అమెరికా తన హామీని నెరవేర్చే వరకు ఎటువంటి చర్చలు ఉండబోవని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికన్లతో చర్చల కోసం ఇరాన్ ప్రతినిధి బృందం ఇస్లామాబాద్ చేరుకుందనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. లెబనాన్‌లో శాంతి నెలకొనే వరకు అమెరికా వైపుతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ‘ఫార్స్ వార్తా సంస్థ’ కూడా తేల్చి చెప్పింది. మరోవైపు, లెబనాన్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి వేదికగా అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేసింది. ఐరాస శాంతి పరిరక్షక దళాల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ఈ విషయంలో భద్రతా మండలి తన వద్ద ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించి శాంతి దళాలకు రక్షణ కల్పించాలని ఇండోనేషియా శాశ్వత ప్రతినిధి ఉమర్ హదీ డిమాండ్ చేశారు. ఇంతకీ ఏం జరగనుందో రేపటితో తెలియనుంది.

Exit mobile version