Site icon NTV Telugu

Who Rules Iran: ఇరాన్‌లో అసలు అధికారం ఎవరి చేతుల్లో ఉంది? భారత నౌకలపై కాల్పులతో పెరుగుతున్న ఉత్కంఠ!

Hormuz Conflict

Hormuz Conflict

Who Rules Iran: మిడిల్ ఈస్ట్ (మధ్యప్రాచ్యం)లో ప్రస్తుతం యుద్ధ మేఘాలు ఏ దిశగా సాగుతున్నాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది. శనివారం వ్యూహాత్మక ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ (హోర్ముజ్ జలసంధి) గుండా ప్రయాణిస్తున్న రెండు భారతీయ నౌకలపై ఇరాన్ దళాలు కాల్పులు జరపడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఈ ఘటన ఇరాన్ అంతర్గత అధికార పోరాటాన్ని బహిర్గతం చేయడమే కాకుండా, ఆ దేశాన్ని అసలు ఎవరు నడిపిస్తున్నారనే సందేహాలను పెంచుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

READ ALSO: SRH vs CSK: కాటేరమ్మ కొడుకుల కసివేట.. సీఎస్‌కేపై ఎస్‌ఆర్‌హెచ్ సూపర్ విక్టరీ..

భారత్ తీవ్ర నిరసన
భారతీయ నౌకలపై కాల్పుల ఘటనను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిగణించింది. వెంటనే ఇరాన్ రాయబారిని పిలిపించి అధికారికంగా నిరసన వ్యక్తం చేసింది. పౌర నౌకలపై ఏ పరిస్థితుల్లో కాల్పులు జరిపారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. ఇరాన్ అధికార యంత్రాంగంలో కనిపిస్తున్న స్పష్టమైన విభజన ఈ గందరగోళానికి ప్రధాన కారణం అని చెబుతున్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘచీ ఇటీవల మాట్లాడుతూ.. లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత హోర్ముజ్ మార్గం తెరిచే ఉందని ప్రకటించారు. దీంతో నౌకల రాకపోకలు పెరిగాయి. ఇదే సమయంలో ఇరాన్‌లో అత్యంత శక్తిమంతమైన సైనిక విభాగం ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్’ (IRGC) మాత్రం తమ అనుమతి లేకుండా ఏ నౌక కూడా వెళ్లడానికి వీల్లేదని హెచ్చరిస్తోంది. విదేశాంగ మంత్రి మార్గం తెరిచి ఉందని చెబుతుంటే, క్షేత్రస్థాయిలో ఉన్న IRGC దళాలు నౌకలపై కాల్పులు జరుపుతుండటం చూస్తుంటే.. ఇరాన్ పగ్గాలు ప్రభుత్వం చేతుల్లో లేవని, సైన్యం చేతుల్లోనే ఉన్నాయని స్పష్టమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

అధికార శూన్యతతో పెరుగుతున్న ముప్పు
సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్‌లో పెద్ద ఎత్తున అధికార శూన్యత ఏర్పడింది. అధ్యక్షుడు పేజెష్కియాన్ అమెరికాతో చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని చూస్తుంటే, IRGC కమాండర్లు అహ్మద్ వహీదీ, హుస్సేన్ తాయేబ్ వంటి వారు మొండి వైఖరిని అవలంబిస్తున్నారని సమాచారం. ఏప్రిల్ ఆరంభంలో జరిగిన ఒక సమావేశంలో, IRGC ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని అధ్యక్షుడు స్వయంగా ఆరోపించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మారలేదు. ప్రపంచ చమురు, గ్యాస్ వ్యాపారంలో దాదాపు 20 శాతం వాటా ఈ హోర్ముజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. భారత్ తన గ్యాస్ అవసరాల్లో సుమారు 90 శాతం దిగుమతులను ఈ మార్గం నుంచే పొందుతుంది. ఇప్పుడు ఇక్కడ మైన్లు వేయడం, నౌకలపై దాడులు చేయడం వల్ల భారత ఇంధన భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి హోర్ముజ్ జలసంధి సురక్షితం కాదని తాజా కాల్పుల ఘటనతో తేలిపోయింది. ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో ఎవరిది పైచేయి అవుతుందో తేలే వరకు పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఈ అనిశ్చితి కొనసాగేలా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

READ ALSO: Melt Belly Fat: రోజూ ఉదయాన్నే ఈ 5 పనులు చేస్తే పొట్ట కరిగిపోవాల్సిందే!

Exit mobile version