యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రికార్డును టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. టీ20ల్లో 50+ స్కోర్లను అత్యధిక సార్లు చేసిన బ్యాటర్‌గా విరాట్ రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2025లో భాగంగా గురువారం రాత్రి చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ హాఫ్ సెంచరీ (70; 42 బంతుల్లో 8×4, 2×6) చేయడంతో ఈ రికార్డు అతడి ఖాతాలో చేరింది. ఇప్పటివరకు కోహ్లీ 50+ స్కోర్లను 111 సార్లు నమోదు చేశాడు.
టీ20ల్లో 50+ స్కోర్లను క్రిస్ గేల్ 110 సార్లు బాదాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (117) అగ్ర స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ 2025లో విరాట్ కోహ్లీ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే.. ఈ సీజన్‌లోనే వార్నర్‌ను సైతం అధిగమించే అవకాశాలు లేకపోలేదు. రాజస్థాన్ రాయల్స్‌పై చేసిన హాఫ్ సెంచరీతో మరో రికార్డును కింగ్ తన ఖాతాలో వేసుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు కోహ్లీ 62 హాఫ్ సెంచరీలు బాదాడు. ఈ జాబితాలో బాబర్ అజామ్ (61)ను అధిగమించాడు.
Also Read: RCB vs RR: మా ప్రణాళిక చాలా సింపుల్.. ఆర్సీబీ విజయంపై విరాట్ కోహ్లీ!
చిన్నస్వామి స్టేడియంలో విరాట్ కోహ్లీ 105 ఇన్నింగ్స్‌ల్లో 3500 ప్లస్ పరుగులు చేశాడు. ప్రపంచ క్రికెట్‌లో టీ20 ఫార్మాట్‌లో ఒకే వేదికపై 3500 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా విరాట్ నిలిచాడు. ముష్ఫికర్ రహీమ్ మిర్పూర్ వేదికగా 136 ఇన్నింగ్స్‌ల్లో 3,373 పరుగులు బాదాడు. ఇక రాజస్థాన్‌ను చిత్తు చేసిన బెంగళూరు ప్లేఆఫ్స్ కు మరింత చేరువైంది. మిగిలిన ఐదు మ్యాచులలో రెండు గెలిస్తే.. అధికారిక బెర్త్ దక్కుతుంది.