సరైన లక్ష్యాన్ని నమోదు చేయకపోవడమే తమ ఓటమికి కారణం అని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ అన్నాడు. మ్యాచ్‌లో తాము 20-25 పరుగులు తక్కువగా చేశామని, అయితే ఆటలో ఇవన్నీ సహజమే అని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ నుంచి నేర్చుకొని ముందుకు సాగాలనుకుంటున్నామన్నాడు. మ్యాచ్‌లో తమకు చాలా సానుకూలాంశాలు ఉన్నాయని, అవేంటో ఇప్పుడు చెప్పలేను అని పంత్ తెలిపాడు. ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
మ్యాచ్ అనంతరం లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ మాట్లాడుతూ… ‘మేం చేసిన స్కోర్ సరిపోలేదు. మ్యాచ్‌లో 20-25 పరుగులు తక్కువగా చేశాం. అయితే ఇవన్నీ ఆటలో భాగం. మా హోమ్ గ్రౌండ్‌లో పరిస్థితులను ఇప్పటికీ అంచనా వేస్తున్నాను. ఇన్నింగ్స్ ప్రారంభంలో వికెట్లు కోల్పోయినప్పుడు భారీ స్కోరు చేయడం కష్టమే. అయినా ప్రతి ఆటగాడు మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లడానికి తీవ్రంగా ప్రయత్నించారు. స్లో వికెట్‌పై ఆడాలనుకున్నాం. ఇక్కడ బంతులు ఆగి వస్తాయని భావించాను. ఈ మ్యాచ్ నుంచి నేర్చుకొని ముందుకు సాగాలనుకుంటున్నాము. మ్యాచ్‌లో చాలా సానుకూలాంశాలు ఉన్నాయి కానీ.. అవేంటో ఇప్పుడు చెప్పలేను’ అని తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (44; 30 బంతుల్లో 5×4, 2×6), ఆయుష్ బదోని (41; 33 బంతుల్లో 1×4, 3×6) రాణించారు. అర్ష్‌దీప్ (3/43) మూడు వికెట్స్ పడగొట్టాడు. లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 16.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (69; 34 బంతుల్లో 9×4, 3×6), శ్రేయస్ అయ్యర్ (52 నాటౌట్; 30 బంతుల్లో 3×4, 4×6), నేహాల్ వధేరా (43 నాటౌట్; 25 బంతుల్లో 3×4, 4×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.