Site icon NTV Telugu

IPL 2025: అయ్యర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయకపోవడానికి కారణం అదే: వెంకీ

Venky Mysore

Venky Mysore

ఐపీఎల్‌ 2025 సీజన్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కెప్టెన్‌గా టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్య రహానేను ప్రాంచైజీ సీఈవో వెంకీ మైసూర్‌ నియమించారు. డాషింగ్ ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. 23.75 కోట్లు పెట్టి కొనుకున్న అయ్యర్‌ను సారథిగా ఎంపికవుతాడని ముందు నుంచి అందరూ అనుకున్నారు. అయితే సీఈవో వెంకీ అనూహ్యంగా రహానేను కెప్టెన్‌గా నియమించారు. భారీ మొత్తం వెచ్చించి కొనుకున్న అయ్యర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయకపోవడంపై సీఈవో వెంకీ మైసూర్‌ వివరణ ఇచ్చారు. అయ్యర్‌ ఇంకా పరిణితి సాధించాల్సి ఉందని, అత్యున్నత బాధ్యతలు చేపట్టేందుకు ఇంకా సమయం ఉందని చెప్పారు.

కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్‌ ఈఎస్‌పీఎన్-క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ… ‘ఐపీఎల్ చాలా ఒత్తిడితో కూడిన టోర్నమెంట్. కెప్టెన్సీ కోసం మేము వెంకటేష్ అయ్యర్ గురించి చర్చించాం. అయితే కెప్టెన్సీ కారణంగా యువకుడైన అతడిపై భారం పడుతుందని భావించాం. టోర్నీ ముందుకు సాగుతున్న కొద్దీ సవాళ్లు ఎదురవుతాయి. స్థిరత్వం, పరిణతి, అనుభవం ఉన్న ఆటగాడు అవసరం. ఈ లక్షణాలు అజింక్య రహానేలో ఉన్నాయి’ అని చెప్పారు. వెంకటేష్ అయ్యర్ తదుపరి కేకేఆర్ కెప్టెన్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రహానే కెప్టెన్సీలో అయ్యర్ అన్ని విషయాలు నేర్చుకుంటాడు.

Also Read: Rohit Sharma: ఐపీఎల్‌ 2025 తర్వాతే రోహిత్ శర్మ నిర్ణయం!

ఐపీఎల్ 2024 అనంతరం వెంకటేష్ అయ్యర్‌ను కేకేఆర్ విడుదల చేసింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అతన్ని తిరిగి రూ.23.75 కోట్లకు దక్కించుకుంది. మరోవైపు వేలంలో అజింక్య రహానే పేరు మొదట వచ్చినప్పుడు కేకేఆర్ తీసుకోలేదు. అమ్ముడుపోని ఆటగాళ్లు మరోసారి వేలంలోకి రాగా.. రహానేను బేస్ ప్రైజ్ రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది. 36 ఏళ్ల రహానే 2008 నుండి వివిధ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పటివరకు 185 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. భారత జట్టుకు కూడా సారథ్యం వహించిన అనుభవం అతడికి ఉంది. ఐపీఎల్ 2024లో టైటిల్‌ అందించిన కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ జట్టును వీడిన విషయం తెలిసిందే. మార్చ్ 22 నుంచి ఐపీఎల్ 2025 ఆరంభం కానుంది.

Exit mobile version