Ricky Ponting Hails Rishabh Pant Batting: కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు కనికరం లేకుండా ఆడారని ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ అన్నాడు. ఇలాంటి ఆటతీరు ఆమోదయోగ్యం కాదన్నాడు. ఢిల్లీ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించారని, తొలి అర్ధభాగం ఆటను చూస్తే తనకు సిగ్గేసిందని తెలిపాడు. కోల్‌కతా మ్యాచ్‌లో చాలా పొరపాట్లను చేశామని, తర్వాత మ్యాచ్ నాటికి సమస్యలను పరిష్కరించుకుని బరిలోకి దిగాల్సి ఉందని పాంటింగ్ పేర్కొన్నాడు. బుధవారం విశాఖలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 272 పరుగుల భారీ స్కోరు చేయగా.. ఛేదనలో ఢిల్లీ 17.2 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. ఢిల్లీ 106 పరుగుల తేడాతో పరాజయంపాలైంది.
మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రికీ పాంటింగ్ మాట్లాడుతూ… ‘మ్యాచ్‌లో తొలి అర్ధభాగం మా ఆటను చూస్తే నాకే సిగ్గేసింది. బౌలర్లు భారీగా పరుగులు ఇచ్చారు. దీంతో 20 ఓవర్లు వేయడానికి దాదాపుగా 2 గంటల సమయం పట్టింది. మేం 2 ఓవర్లు వెనుకబడిపోయాం. దాంతో చివరి రెండు ఓవర్లను సర్కిల్ ఆవల కేవలం నలుగురు ఫీల్డర్లతోనే బౌలింగ్ చేయాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో మేం చాలా పొరపాట్లను చేశాం. తర్వాత మ్యాచ్ నాటికి వాటిని పరిష్కరించుకుని బరిలోకి దిగుతాం. లేదంటే టోర్నీలో మరింత వెనుకబడిపోవాల్సి ఉంటుంది’ అని అన్నాడు.
Also Read: Mrunal Thakur: రోజూ ఏడ్చేదాన్ని.. తెలుగు సినిమాల్లో నటించొద్దనుకున్నా: మృణాల్ ఠాకూర్
‘పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో కోల్‌కతా బ్యాటర్లు రెచ్చిపోయారు. ఏమాత్రం కనికరం లేకుండా ఆడారు. పవర్ ప్లేలోనే 88 పరుగులు రావడంతో మేం వెనకపడిపోయాం. ఛేదనలో పోరాడే అవకాశం మాకు లేకుండా పోయింది. ఈ ఓటమి మమ్మల్ని నిరాశ పరిచింది. రిషబ్ పంత్ బాగా ఆడడం సంతోషకరమైన విషయం. అభిమానుల అంచనాలను పంత్ అందుకున్నాడు. ఇప్పటివరకు పంత్ ఫిజియోను పిలిచిన దాఖలాలు లేవు. క్రీజ్‌లోనూ, స్టంప్స్ వెనుక ఎలాంటి ఇబ్బంది లేకుండా యాక్టివ్‌గా ఉన్నాడు. టోర్నీలో మరింత బాగా ఆడతాడు’ అని రికీ పాంటింగ్ ధీమా వ్యక్తం చేశాడు.
