CSK Coach Stephen Fleming opened up on Daryl Mitchell Buy: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీని భర్తీ చేయడంపై ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు. గత పదేళ్లుగా ధోనీ వారసుడి కోసం వేట కొనసాగుతోందని చెప్పాడు. ప్రతి ఏడాది చెన్నై కెప్టెన్సీ చర్చగా మారుతోందని, అయితే కెప్టెన్ కూల్ ధోనీ మాత్రం ప్రతి ఏడాది జట్టును అత్యుత్తమంగా నడిపిస్తున్నాడని ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. ఫ్లెమింగ్ మాటలను బట్టి చూస్తే.. ఐపీఎల్ 2024 సీజన్‌లో చెన్నైని ధోనీ నడిపించడం ఖాయంగానే కనిపిస్తోంది.
మంగళవారం ఐపీఎల్ 2024కు సంబందించిన వేలం ముగిసిన అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సీఎస్‌కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ… ‘ఎంఎస్ ధోనీ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ నాయకత్వ బాధ్యతలను చేపట్టే వారి కోసం మేం గత పదేళ్లుగా అన్వేషిస్తున్నాం. ప్రతి ఏడాది ఇది ఓ పెద్ద చర్చగా మారుతోంది. అయితే ధోనీని గత కొంతకాలంగా నేను చూస్తున్నా. మహీలో ఉత్సాహం, ఆటపట్ల అభిరుచి ఏమాత్రం తగ్గలేదు. మేం అలాగే కొనసాగుతాం’ అని చెప్పాడు. ఐపీఎల్ 2024కు ధోనీ నాయకత్వం వహించినా.. 2025కి అతడు రిటైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Coronavirus India: కరోనా కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి: కేంద్ర ఆరోగ్య శాఖ
వేలంలో డారిల్ మిచెల్‌ను భారీ ధరకు సీఎస్‌కే కొనుగోలు చేయడంపై స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు. ‘డారిల్ మిచెల్ విభిన్న ఆటగాడు. గత ఏడాదిన్నర నుంచి అతడి ప్రదర్శన బాగుంది. తీవ్ర ఒత్తిడిలోనూ బాగా ఆడగలడు. స్పిన్‌ను కూడా సమర్థంగా ఎదుర్కొంటాడు. అంతేకాదు బౌలర్‌గానూ ఉపయోగపడతాడు. చెపాక్‌లో డారిల్ కీలక పాత్ర పోషిస్తాడని భావిస్తున్నాం. తప్పకుండా ఈ కొనుగోలు మాకు ఉపయోగపడుతుంది’ అని క్లారిటీ ఇచ్చాడు. ఐపీఎల్ 2024 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆరుగురు ఆటగాళ్లను కొనుగోలు చేసింది. డారిల్ మిచెల్‌ను 14 కోట్లకు సొంతం చేసుకుంది. శార్దూల్ ఠాకూర్ (4 కోట్లు), రచిన్ రవీంద్ర (1.80 కోట్లు), సమీర్ రిజ్వీ (8.40 కోట్లు), ముస్తిఫిజుర్ రెహమాన్ (2 కోట్లు), అరవెల్లి అవనీష్ (2 కోట్లు)లను చెన్నై కొనుగోలు చేసింది.