Site icon NTV Telugu

Off The Record: నెల్లూరు జిల్లాలో తీవ్ర స్థాయికి తమ్ముళ్ళ తన్నులాటలు..

Nlr

Nlr

జిల్లాలో టీడీపీ నేతలు తన్నులాటలు, తలకపోతలతో రచ్చ రచ్చ చేసుకుంటున్నా.. ఆ ఇన్ఛార్జ్‌ మంత్రి మాత్రం నాకేం కనపడదు, వినపడదు అన్నట్టుగా ఉంటున్నారా? పార్టీ పరువు నడి రోడ్డు మీదికి వస్తున్నా.. ఆయన మాత్రం ఆ గోల నాకేల అంటున్నారా? నవ్వే వాళ్ళను నవ్వనీ, ఏడ్చేవాళ్ళను ఏడ్వనీ అన్నట్టు నిర్లిప్తంగా ఉంటున్న ఆ ఇన్ఛార్జ్‌ మినిస్టర్‌ ఎవరు? ఆయన ఎందుకలా ఉంటున్నారు?

Also Read:Maharashtra: పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం.. వాహనాలను ఢీకొన్న ట్రక్కు.. 8 మంది సజీవ దహనం

సింహపురి టీడీపీలో అంతర్గత విభేదాలు రచ్చో రచ్చస్య అన్నట్టుగా మారిపోతున్నాయి. నేతల మధ్య మనస్పర్ధలు చినికి చినికి గాలి వానగా మారి తీరం దాటడానికి సిద్ధంగా ఉన్నా… పట్టించుకోవాల్సివాళ్ళు మాత్రం ఆ పని చేయడం లేదన్న అసంతృప్తి పెరుగుతోంది కేడర్‌లో. జిల్లాల్లో ఏ సమస్య వచ్చినా, నాయకుల మధ్య ఎలాంటి విభేదాలున్నా…. ఇన్ఛార్జ్‌ మంత్రులు జోక్యం చేసుకుని సరిదిద్దాలని, అభివృద్ధి కార్యక్రమాల్లో అంతా ఇన్వాల్వ్‌ అయ్యేట్టు చేయాలని పదే పదే మొత్తుకుంటున్నారు సీఎం చంద్రబాబు. అయినా సరే…. నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్‌ మంత్రి ఎన్‌.ఎం.డీ ఫరూక్‌ ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న అసహనం పెరుగుతోందట కార్యకర్తల్లో. పంచాయితీలు, సమస్యల పరిష్కారాల మాట అటుంచితే… ఫరూక్‌ అసలు జిల్లాకు రావడమే మానేశారని అసహనం వ్యక్తం చేస్తున్నారు స్థానిక నాయకులు.

అప్పుడప్పుడు నామ్‌కే వాస్తే… వచ్చి ఉన్నానంటే ఉన్నానన్నట్టు చేస్తున్నారు తప్ప జిల్లా వ్యవహారాల మీద అస్సలు దృష్టి పెట్టడం లేదట. ఆయన తనకు తానుగా జోక్యం చేసుకోవడం లేదు సరే….. మా దగ్గర ఫలానా సమస్య ఉందని జిల్లా నాయకులు వెళ్ళి చెప్పినా నో యూజ్‌. దీంతో అసంతృప్త నేతలు ఇక చెలరేగుతూ…. బాహాటంగానే సొంత పార్టీ నేతలపై విమర్శలు సంధిస్తున్నారు. దీంతో.. ఇన్ఛార్జ్‌ మంత్రి వల్ల ఉపయోగం ఏంటి? చంద్రబాబు చెప్పే మాటలు ఇక్కడ అప్లయ్‌ కావా అంటూ తమ్ముళ్లే గుసగుసలాడుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో బలంగా కనిపించిన వైసీపీని ఎలక్షన్స్‌లో చావుదెబ్బ కొట్టాయి కూటమి పార్టీలు. జిల్లా చరిత్రలో ఎన్నడూ నేనంతగా పది అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్నాయి.

కానీ… తీరా అధికారంలోకి వచ్చాక.. ఆ ఊపు, ఆధిపత్యాన్ని కొనసాగించలేక టీడీపీ సతమతం అవుతోందన్న మాటలు వినిపిస్తున్నాయి విశ్లేషకుల్లో. కలిసికట్టుగా ప్రతిపక్షాన్ని ఎదుర్కోవాల్సిన అధికార పార్టీ నేతలు.. అంతర్గత విభేదాలతో బలహీనపడుతున్నారన్నది లోకల్‌ పొలిటికల్‌ సర్కిల్స్‌ వాయిస్‌. ఈ పరిస్థితుల్లో సెట్‌ చేయాల్సిన జిల్లా ఇన్ఛార్జ్‌ మంత్రి ఫరూక్‌ మాత్రం, ఆ…. నాకెందుకునే అని ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారట. సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే మంత్రి నారాయణతో పాటు.. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మరో సీనియర్‌ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఉన్న జిల్లాలో వేలు పెడితే… నా వేలే కాలుతుందేమోనన్న భయం ఫరూక్‌కు ఉండి ఉండవచ్చన్నది టీడీపీ వర్గాల్లో ఉన్నఇంకో వెర్షన్‌.

పట్టించుకోవాల్సిన వాళ్ళు పట్టీ పట్టనట్టుగా ఉండటం వల్లే… ఇటీవల రేషన్‌ మాఫియా విషయంలో రచ్చ రచ్చ అయిందని అంటున్నారు. దాని మీద నుడా చైర్మన్ ఫిర్యాదు చేసిన సమయంలోనే ఇన్చార్జ్ మంత్రి స్పందించి ఉంటే అంత రచ్చ అయ్యేది కాదని, పార్టీ పరువు బజారుకు ఎక్కేది కాదని మాట్లాడుకుంటున్నారు జిల్లాలో. కానీ… సదరు రేషన్‌ మాఫియా కింగ్‌పిన్‌కు ప్రభుత్వంలోని ఓ అత్యంత కీలకమైన మంత్రి మనిషి అన్న ముద్ర ఉండటం వల్లే ఫరూక్‌ సైలెంట్‌ అయినట్టు సమాచారం. ఇక కావలి ఎపిసోడ్‌లో కూడా ఇంచార్జ్ మంత్రి బాధ్యత లేనట్టుగా వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి, సీనియర్ నేత మాలిపాటి సుబ్బానాయుడికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉన్నప్పుడు ఇద్దర్నీ కూర్చోబెట్టి మాట్లాడి ఉంటే అంత సీరియస్‌ అయ్యేది కాదన్న భావన క్యాడర్‌లో వ్యక్తం అవుతోంది.

చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన పార్టీ పరువు బజారున పడినప్పుడే నేతలు స్పందిస్తున్నారు తప్ప… ముందు జాగ్రత్తలు తీసుకోవడం లేదన్న అసంతృప్తి పెరుగుతోంది. ఈ వ్యవహారం ఒక్క ఫరూక్‌కే పరిమితం కాలేదని, చాలా మంది ఇన్ఛార్జ్‌ మంత్రులు ఇలాగే వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం ఉంది టీడీపీ వర్గాల్లో. మరీ ముఖ్యంగా జిల్లాల్లో సీనియర్‌ మంత్రులు ఉన్న చోట ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయట. గతంలో వైసీపీ మీద పోరాటాలు చేసి పార్టీని అధికారంలోకి తీసుకొస్తే.. ఇప్పుడు ఇంచార్జ్ మంత్రులు, కీలక నేతల మెతక వైఖరి వల్ల పార్టీ డ్యామేజ్ అవుతోందన్న బాధ కేడర్‌లో పెరుగుతోందని చెప్పుకుంటున్నారు. ఇక నెల్లూరు విషయానికే వస్తే… కొందరు ఎమ్మెల్యేలు అక్రమాలకు పాల్పడుతున్నట్టు విపరీతంగా ఆరోపణలు వస్తున్నా… ఫరూక్‌ పట్టీ పట్టనట్టుగా ఉంటున్నారని సొంత కేడరే మాట్లాడుకుంటోంది.

Also Read:హోమ్ థియేటర్ అనుభవం ఇక ఇంట్లోనే.. ZEBRONICS Juke Bar 6500 పై రూ.11000 భారీ డిస్కౌంట్..!

అలాగే… జిల్లా టీడీపీ అధ్యక్షుడు, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్‌తో ఫరూక్కు విబేధాలున్నాయని, మంత్రి నిర్లిప్తతకు అది కూడా ఓ కారణం అన్నది NTR భవన్‌ టాక్‌. ఇన్ఛార్జ్‌ మంత్రులకు పూర్తిస్థాయి పవర్స్‌ లేకపోవడం, రాష్ట్ర స్థాయి నేతలతో గాఢమైన సంబంధాలున్న లోకల్ లీడర్స్‌లో ఎవర్ని టచ్‌ చేస్తే ఎట్నుంచి ఫోన్స్‌ వస్తాయో తెలియకపోవడం లాంటి కారణాలతో సమస్యలు పెరుగుతున్నాయన్నది ఓ విశ్లేషణ. ఈ పరిస్థితుల్ని సెట్‌ చేయకుంటే ఓవరాల్‌గా ఇన్ఛార్జ్‌ మంత్రులు ఉత్సవ విగ్రహాలుగానే మిగిలిపోతారని, అసలు ఆ వ్యవస్థ అంటే విలువ లేకుండా పోతుందన్న మాటలు వినిపిస్తున్నాయి తెలుగుదేశం వర్గాల్లో.

Exit mobile version