ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో జూన్ 26 నుంచి జూలై 4వ తారీకు వరకు ‘వారాహి నవరాత్రులు’ నిర్వహించనున్నారు. విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వరి దేవస్థానంలో అమ్మవారి ఆషాడ మాస సారె సమర్పణ ఉత్సవాలు నిర్వహించనున్నారు. మహా మండపంలోని ఆరవంతస్తులో అమ్మవారి ఉత్సవం మూర్తిని ప్రతిష్టించి పూజాభిషేకాలు నిర్వహిస్తారు. ప్రస్తుతం ఆషాడ సారె సమర్పణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉత్సవాలకు అవసరమైన ఏర్పాట్లపై ఈవోతో ఆలయ వైదిక కమిటీ, అర్చకులు చర్చించారు.
వారాహి అమ్మవారి నవరాత్రులు, ఆషాడం మాస సారె సమర్పణ ఏర్పాట్లపై ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఈవో శీనా నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. వైదిక కమిటీ సూచనల మేరకు హోమ గుండాలు, భక్తులు కూర్చునేందుకు తివాచీలు ఏర్పాటు తదితర అంశాలపై ఈవో శీనా నాయక్ అధికారులకు సూచనలు చేశారు. అలాగే వారాహి అమ్మవారి నవరాత్రుల గురించి ప్రచారం చేసి విజయవంతం చేయాలని పలు విభాగాలకు ఆదేశాలు ఇచ్చారు. జూన్ 26 నుంచి జూలై 24 వరకు ఆషాఢ మాసోత్సవాలు, జూన్ 26 నుంచి జూలై 4 వరకు వారాహి నవ రాత్రులు, జూలై 8 నుంచి 10వ తేదీ వరకు శాకంబరీదేవి ఉత్సవాలు జరగనున్నాయి.
Also Read: Zepto: ఐటీ ఉద్యోగినిపై డెలివరీ బాయ్ అత్యాచారయత్నం.. ఫిర్యాదు చేసినా పట్టించుకోని జెప్టో!
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని.. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు భక్తులు సారెను సమర్పించడం ఆనవాయితీ. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటకల నుంచి కూడా దుర్గమ్మకు భక్తులు సారె సమర్పిస్తారు. మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవమూర్తిని ప్రతిష్టించి పూజలు చేస్తారు. మూలవిరాట్ దర్శన అనంతరం ఉత్సవమూర్తికి సారెను సమర్పిస్తారు.