IndiGo: భారతదేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోలో గత 8 రోజులుగా కొనసాగిన భారీ గందరగోళం చివరకు సమసిపోయి, సాధారణ స్థితికి వచ్చినట్లు ఆ సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ మంగళవారం ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో పేర్కొన్నారు. కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిట్స్ (ఎఫ్‌డీటీఎల్) నిబంధనలకు అనుగుణంగా ఇండిగో క్రూ షెడ్యూలింగ్‌ను సరి చేయడంలో విఫలం కావడంతో సంస్థలో ఈ సంక్షోభం ఏర్పడి వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
READ ALSO: Akhanda 2 : అఖండ ఆగమనం..తప్పుకుంటున్న సినిమాలివే!
ఈ సందర్భంగా ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ మంగళవారం ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియో సందేశం ద్వారా క్షమాపణలు చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. “మా విమాన సర్వీసులు పూర్తిగా సాధారణ స్థితికి చేరుకున్నాయి. ప్రయాణికులకు ఏర్పడిన అసౌకర్యానికి మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాము” అని ఆయన పేర్కొన్నారు. ఇక మీదట ఇండిగో విమాన సేవల్లో ఎటువంటి అసౌకర్యం కలగదని ఆయన వెల్లడించారు. మెరుగైన సేవలు అందించేందుకు ఇండిగో సిబ్బంది అంత కష్టపడి పని చేస్తున్నారని చెప్పారు. ఇండిగోకు ప్రయాణికులే మొదటి ప్రాధాన్యత అని అన్నారు. ఇప్పటి నుంచి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, ఇప్పటికే లక్షలాది ప్రయాణికులకు పూర్తి రిఫండ్ చెల్లించామని తెలిపారు. అలాగే ప్రయాణికుల బ్యాగేజీలు వారి నివాసాలకు చేర్చామని, మిగిలిన మరికొన్ని బ్యాగేజీలను కూడా వారి నివాసాలకు చేర్చేందుకు తగిన ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. డిసెంబర్ 5 తేదీన 700 ఫ్లైట్లు మాత్రమే నడపగలిగామని, ఇక నిన్న, ఈరోజు మొత్తం 18 వందల ఫ్లైట్లను అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. 138 గమ్య స్థానాలకు ఇండిగో ప్రయాణాలు కొనసాగుతున్నాయని, కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ పూర్తి సహకారంతో ముందుకు వెళ్తున్నామని ఆయన తెలిపారు.
ఇక పోతే ఇండిగో సీఈఓ ప్రకటనపై ప్రయాణికులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ఇది కేవలం ప్రచార స్టంట్ మాత్రమే. ప్రయాణికులు బాధపడుతుంటే ధరలు 3-4 రెట్లు పెంచారు. పూర్తి రిఫండ్, నష్టపరిహారం ఇవ్వాలి” అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు. మరొక నెటిజన్ స్పందిస్తూ “సీఈవోను తొలగించాలి. ఇండిగోకు బదులు ఎయిర్ ఇండియా వంటి ఇతర సంస్థలకు మారాలి” అని సూచించారు. ఇంకొక నెటిజన్ స్పందిస్తూ డిసెంబర్ 9న కూడా 152 విమానాలు (ఎక్కువగా ఢిల్లీలో) రద్దయ్యాయని పేర్కొన్నారు. ఇక ఇప్పటి వరకు కూడా తమ రిఫండ్ పూర్తిగా తమకు చెల్లించలేదని చాలా మంది ప్రయాణికులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కొత్త నిబంధనలకు అనుగుణంగా ఇండిగో తన క్రూ షెడ్యూలింగ్ సిస్టమ్‌ను సరిగా సర్దుబాటు చేయలేకపోవడంతో డిసెంబర్ 1 నుంచి ఈ సంస్థ విమానాల రద్దులు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 5న మాత్రమే 1000కు పైగా విమానాలు (సాధారణ షెడ్యూల్‌లో సగం) రద్దయ్యాయి. మొత్తంగా 8 రోజుల్లో వేలాది విమానాలు రద్దు కావడంతో విమానాశ్రయాల్లో ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. పలువురు విశ్లేషకులు మాట్లాడుతూ.. వాస్తవానికి ఇండిగోకు భారత విమానయాన మార్కెట్‌లో 60 శాతం వాటా ఉండటంతో ఈ సంస్థ సంక్షోభం మొత్తం ఏవియేషన్ సెక్టర్‌పై ప్రభావం చూపిందని చెబుతున్నారు.
IndiGo Operations Normalised | A Message From Pieter Elbers, CEO, IndiGo pic.twitter.com/VVB2yTsIBy
— IndiGo (@IndiGo6E) December 9, 2025
READ ALSO: IndiGo: ఇండిగోపై చర్యలు తీసుకుంటాం..: కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు