NTV Telugu Site icon

Indian Navy Rescues: 19 మంది పాకిస్థానీ నావికుల్ని రక్షించిన భారత నౌకాదళం!

Ins Sumitra

Ins Sumitra

INS Sumitra Rescues 19 Pakistani nationals form Somali Pirates: భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌక ఐఎన్‌ఎస్ సుమిత్ర మరో ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేసింది. అరేబియా సముద్రంలో సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేసిన 19 మంది పాకిస్తానీ నావికులతో కూడిన ఓడను రక్షించింది. అల్‌ నయీమీ అనే ఫిషింగ్ నౌకపై జరిగిన దాడిని ఐఎన్‌ఎస్‌ సుమిత్ర అడ్డుకుంది. 11 మంది సోమాలియా సముద్రపు దొంగల నుంచి 19 మంది పాకిస్తానీ సిబ్బందిని ఐఎన్‌ఎస్‌ సుమిత్ర రక్షించినట్లు భారత నేవీ ప్రతినిధి ఒకరు ఎక్స్‌లో పేర్కొన్నారు.

సోమవారం సోమాలియా తీరంలో ఇరాన్ జెండాతో ఉన్న అల్‌ నయీమీ ఫిషింగ్ నౌకను సముద్రపు దొంగలు చుట్టుముట్టారు. 19 మంది పాకిస్థానీ నావికుల్ని వారు బంధించారు. సమాచారం అందుకున్న భారత యుద్ధనౌక ఐఎన్‌ఎస్ సుమిత్ర.. ఆ ఓడను అడ్డుకుంది. అందులోని బందీలను విడిపించింది. సోమవారం తెల్లవారుజామున కూడా ఐఎన్‌ఎస్‌ సుమిత్ర ఓ ఆపరేషన్‌ను చేసింది. శనివారం రాత్రి అరేబియా సముద్రంలో ఇరాన్‌ చేపల బోటు ఎంవీ ఇమాన్‌ను సోమాలియా దొంగలు హైజాక్ చేశారు. తమను రక్షించమని ఇరాన్‌ బోటు నుంచి ఆదివారం భారత్‌ నౌకాదళానికి అత్యవసర సందేశం వచ్చింది. రంగంలోకి దిగిన ఐఎన్‌ఎస్‌ సుమిత్ర, అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్‌ ధ్రువ్‌.. 17 మంది మత్స్యకారులను రక్షించింది.

Also Read: Indian Student: అమెరికాలో అదృశ్యమైన భారత విద్యార్థి మృతి.. యూనివర్సిటీ క్యాంపస్‌లోనే..!
2023 అక్టోబరు 7న ప్రారంభమైన ఇజ్రాయెల్‌-హమాస్ యుద్ధం తర్వాత ఎర్రసముద్రంలో వ్యాపార నౌకలు హైజాక్ అవుతున్నాయి. ఇరాన్ మద్దతుగల యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు.. క్షిపణులు, డ్రోన్‌లతో ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. ఇటీవల గల్ఫ్‌ ఆఫ్ ఎడెన్‌లో ఆయిల్‌ ట్యాంకర్లతో వెళుతున్న మార్లిన్‌ లాండ నౌకపై క్షిపణితో దాడి చేశారు. ఆ నౌక నుంచి వచ్చిన సందేశానికి స్పందించిన భారత నేవీ.. సమీపంలోని ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం నౌకను రంగంలోకి దింపి సహాయ చర్యలు చేపట్టింది.