Economy vs Rupee: భారత ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, రూపాయి విలువ మాత్రం అమెరికా డాలర్‌తో పోలిస్తే చరిత్రలో తొలిసారిగా 90 రూపాయల మార్కుకు చేరుకుని బలహీనపడింది. వరుస త్రైమాసికాల్లో GDP వృద్ధి అంచనాలను మించి, Q2 FY26లో 8.2 శాతం వృద్ధితో దూసుకుపోతుంది. ప్రపంచ సంస్థలు కూడా ఇప్పుడు భారతదేశంలో వృద్ధిని కొనియాడుతున్నాయి. కానీ, మరోవైపు, కరెన్సీ బలహీనపడడం చాలా అనేక అనుమానాలకు తావిస్తుంది. ఆర్థిక నిపుణుల ప్రకారం, జీడీపీ అనేది దేశీయ కార్యకలాపాలను ప్రతిబింబిస్తే, కరెన్సీ అంతర్జాతీయ ఆర్థిక బలాలను ప్రతిబింబిస్తుంది అంటున్నారు.
Read Also: PM Modi: ప్రోటోకాల్ బ్రేక్ చేసి, మోడీ స్వయంగా ఆహ్వానించిన విదేశీ అతిథులు వీరే..
ఇక, బలమైన ఆర్థిక వ్యవస్థ అంటే కచ్చితంగా బలమైన రూపాయి అన్నట్టే కాకుండా, ప్రపంచ మూలధన ప్రవాహాలు, వడ్డీ రేట్ల వ్యత్యాసాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి వంటి అంశాల వల్ల కరెన్సీ దెబ్బ తింటుందని అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో వడ్డీ రేట్లు పెరగడంతో పెట్టుబడులు డాలర్ వైపు వెళ్లడం రూపాయిపై ఒత్తిడిని పెంచుతోంది. ఇదే సమయంలో భారత్ ఇంధనం, ఎలక్ట్రానిక్స్, బంగారం వంటి వాటిపై భారీగా ఆధారపడటంతో డాలర్ విలువను పెంచుతుంది.
అయితే, అమెరికా-చైనా ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితితో పాటు ట్రంప్ నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా డాలర్ బలపడుతోంది. ఈ నేపథ్యంలో డాలర్ బలపడితే, రూపాయి సహా ప్రపంచంలోని చాలా కరెన్సీలు బలహీనపడతాయని ఎకనామిక్ పండితులు పేర్కొంటున్నారు. వినియోగం పెరగడంతో వాణిజ్య లోటు విస్తరించింది, దీని ప్రభావం స్పష్టంగా కరెన్సీపై పడుతోందన్నారు. అలాగే, భారత్- యూఎస్ వాణిజ్య ఒప్పందం ఆలస్యమవుతుండటంతో పెట్టుబడిదారుల్లో అనిశ్చితి నెలకొంది. ఇదంతా రూపాయి పతనం కావడానికి మరో కారణంగా చెప్పొచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జోక్యం చేసుకోకపోవడం కూడా కొంత ప్రభావం చూపుతోంది. కరెన్సీని ఒక నిర్దిష్ట స్థాయిలో కాపాడకుండా, కేవలం అస్థిరత ఏర్పడితేనే ఆర్బీఐ జోక్యం చేసుకుంటుంది.
Read Also: Parakamani Theft Case: పరకామణి చోరీ కేసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
కాగా, రాబోయే రోజుల్లో రూపాయి 89.50–91.20కి చేరుకునే ప్రమాదం ఉంది. కరెన్సీ విలువ పునరుద్ధరణ కోసం విదేశీ పెట్టుబడులు, భారత ఎగుమతుల్లో వేగం పెంచడం వంటి అంశాలు కీలకం కానున్నాయి. రూపాయి బలహీనత వల్ల విదేశీ ప్రయాణం, చదువు, దిగుమతి వస్తువులు మరింత ఖరీదు అవుతాయి. అయితే, ఐటీ నిపుణులు, ఎగుమతిదారులు, విదేశాల నుంచి డబ్బులు అందుకునే కుటుంబాలకు ఇది లాభదాయకం అని చెప్పాలి. మొత్తంగా, భారతదేశ వృద్ధి బలంగానే కొనసాగుతున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు, దిగుమతుల కారణంగా రూపాయి విలువ దారుణంగా పడిపోతుంది.