హైదరాబాద్ ఉప్పల్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి వన్డే ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇచ్చింది. ఈ ఉత్కంఠ పోరులో గెలిచి జోరుమీదున్న టీమిండియా రెండో వన్డేలో రెట్టించిన ఉత్సాహంతో బరిలో దిగుతోంది. నేడు రాయ్‌పూర్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలన్న ఉత్సాహంతో ఉంది. ఇక ఈ పోరులోలైనా విజయం సాధించేందుకు కివీస్ వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. జట్టులో పెద్దగా మార్పులేమీ చేయలేదు. పేసర్ ఉమ్రాన్ మాలిక్‌కు మరోసారి మొండిచేయి ఎందురైంది. ఆల్‌రౌండర్ ఆప్షన్‌తో శార్దూల్ ఠాకూర్‌కు మరో అవకాశం లభించింది. ఇరుజట్లు ఫైనల్ ఎలెవన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు.
Also Read : Fake Call : రష్యా – గోవా విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
కాగా, తొలి వన్డేలో విఫలమైన స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో సెంచరీలు బాదాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అలాగే ఉప్పల్‌లో డబుల్ సెంచరీతో మెరిసిన శుభ్‌మన్ గిల్‌పైనా మంచి అంచనాలున్నాయి. ఇషాన్ కిషన్, సూర్య, హార్దిక్ రాణిస్తే టీమిండియాకు తిరుగుండదు. ఇక తొలి వన్డేలో విధ్వంసం సృష్టించిన న్యూజిలాండ్ బ్యాటర్ బ్రేస్‌వెల్‌తో భారత బౌలర్లు జాగ్రత్తగా ఉండాలి. మొదటి మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నా కూడా కివీస్ బౌలర్లను తక్కువ అంచనా వేయలేం. ఫెర్గుసన్, శాంట్నర్, టిక్నెర్, షింప్లే, బ్రేస్‌వెల్‌లకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా వికెట్ తీయగల సత్తా ఉంది.
భారత జట్టు: గిల్, రోహిత్ (కెప్టెన్), కోహ్లీ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, సుందర్, శార్దూల్, కుల్దీప్ యాదవ్, షమీ, సిరాజ్.
న్యూజిలాండ్ జట్టు: ఫిన్ అలెన్, కాన్వే, హెన్రీ నికోలస్, డారైల్ మిచెల్, లాథమ్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, శాంట్నర్, షిప్లే, ఫెర్గుసన్, టిక్నెర్