NTV Telugu Site icon

U19 Asia Cup 2024: మెరిసిన తెలంగాణ అమ్మాయి.. ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్‌!

Under 19 India Women

Under 19 India Women

అండర్‌-19 ఆసియా కప్‌ 2024 విజేతగా భారత మహిళా జట్టు నిలిచింది. ఆదివారం కౌలాలంపూర్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 41 పరుగుల తేడాతో గెలిచింది. 118 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా 18.3 ఓవర్లలో 76 పరుగులకు ఆలౌట్ అయింది. జువైరియా ఫెర్డోస్ (22) టాప్ స్కోరర్. మహిళల విభాగంలో టీ20 ఫార్మాట్‌లో తొలిసారి జరిగిన అండర్‌-19 ఆసియా కప్‌ను టీమిండియా సొంతం చేసుకుంది. ఇటీవలే అండర్-19 పురుషల ఆసియా కప్‌ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ చేతిలో భారత్‌ ఓడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ ఓటమికి మహిళల జట్టు ప్రతీకారం తీర్చుకున్నట్లైంది.

ఫైనల్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. కమిలిని (5), సానికా చల్కే (0) నిరాశపర్చారు. ఈ సమయంలో తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (52).. కెప్టెన్ నికీ ప్రసాద్‌ (12)తో కలిసి జట్టును ఆడుకుంది. ఈ ఇద్దరు కలిసి 41 పరుగులు జోడించారు. నికీ అనంతరం ఐశ్వరి (5) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. కాసేపటికే త్రిష కూడా పెవిలియన్‌కు చేరింది. మిథిలా (17), ఆయుషి శుక్లా (10) దూకుడు ఆది భారత్ స్కోరును 100 దాటించారు. బంగ్లా బౌలర్లలో ఫర్జానా 4 వికెట్స్ పడగొట్టింది.

ఛేదనలో భారత బౌలర్ల దాటికి బంగ్లాదేశ్‌ మహిళలు వరుసగా పెవిలియన్ చేరారు. జౌరియా ఫెర్డోస్ (22), ఫహోమిదా చోయా (18) మాత్రమే రెండెంకల స్కోర్ అందుకున్నారు. ఇవా, సుబోర్నా, సుమైయా అక్తర్, సైదా అక్తర్, జన్నతుల, హబిబా నిరాశపరిచారు. భారత బౌలర్లలో ఆయుషి శుక్లా 3, సిసోదియా 2, సోనమ్ యాదవ్ 2 వికెట్స్ పడగొట్టారు. హాఫ్ సెంచరీ చేసిన తెలంగాణ అమ్మాయి త్రిషకు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు దక్కింది.

Show comments