NTV Telugu Site icon

Kho Kho World Cup: ఖోఖో ప్రపంచకప్‌ గెలిచిన భారత్‌.. ఒకటి కాదు రెండు!

Kho Kho World Cup 2025

Kho Kho World Cup 2025

మొట్టమొదటి ఖోఖో ప్రపంచకప్‌ను భారత్‌ కైవసం చేసుకుంది. అద్భుత ఆటతో మహిళలు, పురుషుల విభాగాల్లో విజేతగా నిలిచింది. ఆదివారం న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన మహిళల ఫైనల్లో నేపాల్‌ను 78-40తో భారత్ ఓడించింది. ప్రియాంక ఇంగ్లే నేతృత్వంలోని భారత జట్టు ఛేజ్ అండ్ డిఫెన్స్ రెండింటిలోనూ ఆధిపత్యం చెలాయించి మొట్టమొదటి ఖోఖో ప్రపంచకప్‌ను గెలుచుకుంది.

ఫైనల్లో భారత్ 34-0తో ఆధిక్యాన్ని సాధించింది. నేపాల్ పుంజుకుని 35-24తో రేసులోకి వచ్చింది. ఈ సమయంలో కెప్టెన్‌ ప్రియాంక ఇంగ్లే, వైష్ణవి రాణించడంతో విమెన్ ఇన్ బ్లూ 49 పాయింట్ల భారీ ఆధిక్యానికి దూసుకెళ్లింది. చివరకు 78-40తో గెలిచింది. టోర్నీలో భారత మహిళల జట్టు అజేయంగా నిలిచింది. గ్రూప్‌ ఎలో ఉన్న భారత్ మూడు విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. దక్షిణ కొరియాపై 157 పాయింట్ల విజయం (175-18), ఇరాన్‌పై 84 పాయింట్ల విజయం (100-16), మలేషియాపై 80 పాయింట్ల విజయం (100-20)ను నమోదు చేసింది. సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 66-16తో ఓడించి ఫైనల్స్‌లోకి ప్రవేశించింది.

పురుషుల ఫైనల్లో భారత్‌ 54-36తో నేపాల్‌పై గెలిచింది. ఆరంభంలో ఎటాకింగ్‌ గేమ్‌ ఆడిన భారత్‌.. 26-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తర్వాత నేపాల్‌ పుంజుకుంది. దూకుడు కొనసాగించిన భారత్‌ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఖోఖో ప్రపంచకప్‌ కైవసం చేసుకున్న భారత జట్లను ప్రధాని మోడీ అభినందించారు. ఈ విజయం యువతరానికి స్ఫూర్తి అని ఎక్స్‌లో పేర్కొన్నారు.