India Warns Pakistan: దాయాది దేశానికి భారత్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఆఫ్ఘనిస్తాన్-పాకిస్థాన్ యుద్ధంలో ఇండియా తాలిబన్లకు బాసటగా నిలిచింది. తాజాగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఇండియా.. ఆఫ్ఘన్-పాక్ మధ్య నెలకొన్న పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని స్పష్టం చేశారు. పాక్ ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తుందని, ఇప్పటి వరకు వాటిపై సమర్థంగా చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆయన వెల్లడించారు. దాయాది దేశం తన అంతర్గత వైఫల్యాలకు పొరుగువారిని నిందించడం చాలా కాలంగా అలవాటుగా మార్చుకుందని విమర్శించారు. ఆఫ్ఘనిస్థాన్‌లో పాక్ జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ సహించబోదని స్పష్టం చేశారు.
READ ALSO: Mujra Party : అమ్మాయిలతో విందులో చిందులు.. చిక్కిన నేతలు
ఈసందర్భంగా రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. “ఆఫ్ఘనిస్థాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, స్వాతంత్ర్యానికి ఇండియా పూర్తిగా కట్టుబడి ఉంది. భారతదేశం – ఆఫ్ఘనిస్థాన్‌కు మద్దతు ఇస్తుందని, ఏవైనా దేశాలు ఆఫ్ఘన్‌లో బాహ్య జోక్యాన్ని చేయాలని చూస్తే దానిని భారత్ తిరస్కరిస్తుంది” అని అన్నారు. ఇండియా ఎల్లప్పుడూ ఆఫ్ఘన్‌కు సహాయం చేయడానికి, మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని.. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించడంలో భారత్ చురుకైన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. గత కొన్ని ఏళ్లుగా ఆఫ్ఘనిస్థాన్‌ను అస్థిరపరచడానికి ప్రయత్నిస్తున్న ఉగ్రవాద గ్రూపులకు పాక్ మద్దతు ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. భారతదేశం ఈ చర్యలను నిశితంగా పర్యవేక్షిస్తోందని, అంతర్జాతీయంగా వీటిని బహిర్గతం చేయడానికి కృషి చేస్తోందని వెల్లడించారు.
ఆఫ్ఘనిస్థాన్ తన ప్రాదేశిక హక్కులను వినియోగించుకుంటోందని దీనిపై పాక్ అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. ఒక దేశం ప్రాదేశిక సార్వభౌమాధికారం, సరిహద్దు సమగ్రతను ఇతర దేశాలు గౌరవించాలని, ఆఫ్ఘన్ విషయంలో ఎలాంటి బాహ్య జోక్యాన్ని సహించబోమని భారతదేశం స్పష్టంగా పేర్కొంది. అంతేకాకుండా కాబూల్‌లోని తన రాయబార కార్యాలయానికి అప్‌గ్రేడ్ చేయాలనే ప్రణాళికలను కూడా తాజాగా ఇండియా ప్రకటించింది. జూన్ 2022 నుంచి కాబూల్‌లో భారతదేశ సాంకేతిక మిషన్ పనిచేస్తోందని, రాబోయే రోజుల్లో దీనిని పూర్తి స్థాయి రాయబార కార్యాలయంగా మార్చనున్నట్లు రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఈ చర్యను భారతదేశం – ఆఫ్ఘనిస్థాన్‌ల మధ్య పెరుగుతున్న రాజకీయ, దౌత్య సంబంధాలకు చిహ్నంగా భావిస్తున్నారు.
READ ALSO: Pakistan Seeks US Help: తాలిబన్ల దాడితో గజగజలాడిన పాక్.. అగ్రరాజ్యాన్ని కాపాడాలని వేడుకున్న దాయాది