Ind Vs Afg: ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్ 170 పరుగుల భారీ తేడాతో విజయం.. సిరీస్ కైవసం..

India Win

India Win

లక్నోలోని ఎకానా స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత జట్టు 170 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 49.5 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌట్ అయింది. వన్డే క్రికెట్ చరిత్రలో భారత జట్టు 400 పరుగుల మార్కును దాటడం ఇది ఎనిమిదో సారి. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) త్వరగానే అవుటైనప్పటికీ.. రోహిత్ శర్మ (39 బంతుల్లో 48) గిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.

ఆ తర్వాత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఆఫ్ఘన్ బౌలర్లపై విరుచుకుపడుతూ శతకాలతో చెలరేగారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు రికార్డు స్థాయిలో 224 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇషాన్ కిషన్ కేవలం 79 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 125 పరుగులు చేయగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 110 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్లతో 154 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. శ్రేయస్ అయ్యర్ 26, వాషింగ్టన్ సుందర్ 19 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్ డకౌట్ అయ్యాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో నాంగేయాలియా ఖరోటి 4 వికెట్లు, రషీద్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టారు.

×
×
Ad

అనంతరం 403 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారత బౌలర్ల ధాటికి 44.3 ఓవర్లలో 232 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు గుర్బాజ్ (41), ఇబ్రహీం జద్రాన్ (21) మొదటి వికెట్‌కు 52 పరుగులు జోడించినా ఆ తర్వాత వికెట్లు కోల్పోయారు. రహ్మత్ షా ఒక్కడే 79 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక సెదిఖుల్లా అటల్ 42 పరుగులు చేయగా, కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ (4), రషీద్ ఖాన్ (12) నిరాశపరిచారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, సుందర్, అరంగేట్రం చేసిన ప్రిన్స్ యాదవ్ కీలక వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించారు. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది.