Team India Bangladesh Tour: నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బంగ్లాదేశ్‌కు భారత జట్టు..! పూర్తి వివరాలు ఇవే..

India Tour Of Bangladesh

India Tour Of Bangladesh

Team India Bangladesh Tour: సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ భారత క్రికెట్ జట్టు (Indian Cricket Team) త్వరలోనే బంగ్లాదేశ్ పర్యటనకు (Bangladesh Tour) వెళ్లే అవకాశం కనిపిస్తోంది. గతంలో రెండుసార్లు వాయిదా పడిన ఈ పర్యటనను ఈ కొత్త ఏడాది అంటే జనవరి 2027లో నిర్వహించేలా బోర్డులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇరు జట్ల మధ్య 6 మ్యాచ్‌ల వైట్ బాల్ సిరీస్ (White-ball Series) జరగనుంది. ఈ పర్యటనపై భారత క్రికెట్ నియంత్రణ మం‌డలి (BCCI), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య చర్చలు చివరి దశకు చేరుకున్నాయని ఓ జాతీయ మీడియా కథనం పేర్కొంది.

ఈ పర్యటనలో భాగంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే ఈ సిరీస్‌ను క్యాలెండర్‌లో సర్దుబాటు చేయడమే ఇప్పుడు ప్రధాన సవాలుగా మారింది. ఎందుకంటే జనవరి 3 నుంచి 9 మధ్య జింబాబ్వే జట్టు (Zimbabwe Team) 3 వన్డేల సిరీస్ కోసం భారత్‌కు రానుంది. ఆ తర్వాత జనవరి 21 నుంచే ఆస్ట్రేలియా (Australia)తో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy) ప్రారంభం కానుంది. ఈ టైట్‌ షెడ్యూల్‌ మధ్య బంగ్లాదేశ్‌తో 6 మ్యాచ్‌లు ఎలా సాధ్యమవుతాయనేది ఆసక్తికరంగా మారింది.

బంగ్లాదేశ్ పర్యటనకు మార్గం సుగమం చేసేందుకు గాను జింబాబ్వేతో జరగాల్సిన 3 వన్డేల సిరీస్ షెడ్యూల్‌ను మార్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే దీనిపై కూడా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదు. ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు టీమిండియా ఆటగాళ్లు టెస్టు ప్రాక్టీస్ పూర్తి చేసుకోవాల్సి ఉన్నందున, అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక, గతంలో బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడుల నేపథ్యంలో, బంగ్లాదేశ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ (Mustafizur Rahman)ను ఐపీఎల్ 2026 (IPL 2026) నుంచి తప్పించారు. ఈ పరిణామంతో ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు ఒక్కసారిగా క్షీణించాయి. ఆ వివాదం ఏకంగా భారత్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ (T20 World Cup)ను బంగ్లాదేశ్ బహిష్కరించే స్థాయికి చేరింది.

అయితే బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం, ఆ తర్వాత అమీనుల్ ఇస్లాం స్థానంలో మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ (Tamim Iqbal) బీసీబీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడంతో పరిస్థితులు మళ్లీ చక్కబడుతున్నాయి. ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు పునరుద్ధరణ దిశగా సాగుతున్నాయి. కాగా, ఈ ప్రతిపాదిత పర్యటనను ఫైనల్ చేసే ముందు బీసీసీఐ భారత ప్రభుత్వం (Indian Government) నుంచి అవసరమైన అనుమతులు పొందాల్సి ఉంది. ఇక, భారత జట్టు చివరిసారిగా డిసెంబర్ 2022లో బంగ్లాదేశ్‌లో పర్యటించింది. ఆ సమయంలో ఇరు జట్ల మధ్య 3 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. ఒకవేళ జనవరి 2027లో టీమిండియా ధాకా విమానం ఎక్కితే, దాదాపు నాలుగు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత భారత్ మళ్లీ బంగ్లాదేశ్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడినట్లవుతుంది.