NTV Telugu Site icon

IND vs PAK: పాకిస్తాన్‌ చేతిలో ఓటమి.. భారత్ సెమీస్‌ చేరాలంటే..!

India Under 19 Asia Cup

India Under 19 Asia Cup

India Semis Scenario in Under-19 Asia Cup: ఆసియా అండర్‌ -19 ఆసియాకప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన గ్రూప్‌-ఎ రెండో లీగ్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 8 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఇక భారత్ సెమీఫైనల్‌ చేరాలంటే మంగళవారం నేపాల్‌తో జరిగే మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో ఓడితే మాత్రం యువ భారత్ ఆశలు అడియాశలవుతాయి. భారత్, నేపాల్ మ్యాచ్ దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో జరగనుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 259 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఆదర్శ్‌ సింగ్‌ (62; 4 ఫోర్లు, 1 సిక్స్‌), ఉదయ్‌ సహరన్‌ (60; 5 ఫోర్లు), సచిన్‌ దాస్‌ (58; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలు చేశారు. మిగతా బ్యాటర్లు పాక్‌ బౌలర్ల ధాటికి పెద్దగా పరుగులు చేయలేకపోయారు. పాకిస్తాన్ బౌలర్లలో మహ్మద్‌ జీషన్‌ నాలుగు వికెట్స్ పడగొట్టగా.. అమీర్‌ హసన్‌, ఉబైద్‌ షాలు తలా రెండు వికెట్లు పడగొట్టారు.

Also Read: Vrinda Dinesh: అమ్మకు వీడియో కాల్‌ కూడా చేయలేకపోయా: వ్రిందా

అనంతరం పాకిస్తాన్‌ 47 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసి గెలిచింది. అజాన్‌ అవైస్‌ (105 నాటౌట్‌; 10 ఫోర్లు) సెంచరీ బాదాడు. షాజైబ్‌ ఖాన్‌ (63; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), సాద్‌ బేగ్‌ (68 నాటౌట్‌; 8 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్ సెంచరీలు చేశారు. భారత బౌలర్లు వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. మురుగన్‌ అభిషేక్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. భారత్‌తో పాటు గ్రూప్‌-ఏలో ఉన్న పాకిస్తాన్ జట్టుకు ఇది రెండో విజయం. నేపాల్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది.