Vrinda Dinesh React on WPL 2024 Price: కన్నీళ్లు పెట్టుకుంటున్న తన అమ్మను చూడలేనని వీడియో కాల్ చేయలేకపోయా అని యువ బ్యాటర్ వ్రిందా దినేశ్ తెలిపారు. తల్లిదండ్రులకు వారి కలల కారును కొనిస్తానని వెల్లడించారు. శనివారం నిర్వహించిన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024 వేలంలో రూ. 1.3 కోట్లకు వ్రిందా దినేశ్‌ను యూపీ వారియర్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మహిళల ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన రెండో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా 22 ఏళ్ల వ్రిందా నిలిచింది.
డబ్ల్యూపీఎల్‌వేలం డబ్బుతో ఏం చేస్తావని వ్రిందా దినేశ్‌ను ప్రశ్నించగా… ‘వేలంలో యూపీ వారియర్స్ నన్ను కొనుగోలుచేయగానే అమ్మకు ఫోన్ చేశా. అమ్మ చాలా భావోద్వేగం చెందింది. పెద్ద స్వరంతో మాట్లాడింది. కన్నీళ్లు పెట్టుకుంటున్న అమ్మను చూడలేనని వీడియో కాల్ చేయలేదు. అమ్మా, నాన్న ఆనందం పట్టలేకపోయారు. ఈ డబ్బుతో వారి కలల కారును బహుమతిగా ఇస్తా’ తెలిపారు. మహిళల అండర్-23 టీ20 టోర్నీ కోసం కర్ణాటక బ్యాటర్ వ్రిందా రాయ్‌పూర్‌లో ఉన్నారు. వ్రిందా భారీ హిట్టర్ అన్న విషయం తెలిసిందే.
Also Read: Madhya Pradesh CM: మధ్యప్రదేశ్ సీఎం ఎంపిక నేడే.. శివరాజ్ సింగ్‌కు మరోసారి అవకాశం దక్కేనా?
డబ్ల్యూపీఎల్‌లో అధిక ధర తాలూకు ఒత్తిడేం ఉండదని వ్రిందా దినేశ్ తెలిపారు. ‘అధిక ధర నా చేతుల్లో లేదు. నన్ను తీసుకున్న జట్టు కోసం అత్యుత్తమంగా ఆడతా. తాలియా మెక్‌గ్రాత్, డాని వ్యాట్, సోఫీ ఎకిల్‌స్టన్ లాంటి స్టార్ క్రికెటర్లతో కలిసి ఆడే అవకాశం దక్కింది. అలీసా హీలీ కెప్టెన్సీలో ఆడే అవకాశం రావడం నమ్మశక్యంగా లేదు. అలీసా ఆటను ఎప్పుడూ చూస్తూనే ఉంటా. ఇప్పుడు ఆమెతో కలిసి ఇన్నింగ్స్ ఓపెన్ చేసే ఛాన్స్ వస్తే నా కల నిజమైనట్లే. నాది బెంగళూరు కాబట్టి ఆర్సీబీ తరపున ఆడాలనే కోరిక ఉండేది. కానీ ఇప్పుడు యూపీని విజేతగా నిలిపేందుకు శ్రమిస్తా’ అని వ్రిందా చెప్పారు.