అక్టోబర్ నెలలో వేడిని అనుభవించారా..? 2024 అక్టోబర్ దేశంలోనే అత్యంత వేడిగా ఉండే నెలగా నమోదైంది. వాతావరణ శాఖ ప్రకారం.. గతంలో 1951 అక్టోబర్‌లో చాలా వేడిగా ఉన్నట్లు నమోదు కాగా.. తాజాగా 120 ఏళ్ల తర్వాత మళ్లీ చోటు చేసుకుంది. ఈ సంవత్సరం అక్టోబర్‌లో మధ్య భారతదేశంలోని (మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, ఛత్తీస్‌గఢ్)లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యాయి. అంతకుముందు.. ఢిల్లీ NCR సహా ఉత్తర-పశ్చిమ భారతదేశంలో 1901 అక్టోబర్ నెలలో ఎక్కువ వేడి నమోదైంది. ఆ తర్వాత.. నవంబర్‌లో కూడా వేడి నుండి ఉపశమనం లభించలేదు.
వాతావరణ శాఖ ప్రకారం.. నవంబర్ మొదటి రెండు వారాల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగానే ఉంటుందని తెలిపింది. అయితే రెండో వారంలో ఉష్ణోగ్రతలో స్వల్ప తగ్గుదల నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. నవంబర్ చివరి నాటికి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో ఇంత వేడికి గల కారణాలను ఐఎండీ చీఫ్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు. నాలుగు అల్పపీడన వ్యవస్థలు, వేసవి రుతుపవనాల ఆలస్యం, అక్టోబర్‌లో పశ్చిమ భంగం వంటి కారణాల వల్ల వేడి ఏర్పడిందని అన్నారు. అలాగే.. నవంబర్‌లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని.. దీంతో ఈశాన్య, తూర్పు మధ్య, వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో కొన్ని రోజులు వేడిగా ఉంటాయని ఆయన చెప్పారు. అంతే కాకుండా.. పశ్చిమ మధ్య భారతదేశం, వాయువ్య భారతదేశాన్ని కలిపే ప్రాంతాల్లో.. పగటిపూట ఉష్ణోగ్రత సాధారణంగా లేదా సాధారణం కంటే తక్కువగా ఉండవచ్చని అన్నారు.
Read Also: CM Chandrababu: రుషికొండ భవనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
ఈ ఏడాది దేశంలో చలి వాతావరణం ఎలా ఉంటుందో అంచనా వేసే పరిస్థితి లేదని వాతావరణ శాఖ తెలిపింది. లా నినా ఇంకా రూపుదిద్దుకోక పోవడమే ఇందుకు కారణమని పేర్కొంది. లా నినా ఏర్పడిన తర్వాతే ఈ ఏడాది వచ్చే చలిపై సరైన అంచనా వేయవచ్చుని ఐఎండీ తెలిపింది. అన్ని ప్రధాన గ్లోబల్ మోడల్‌లు నవంబర్-డిసెంబర్‌లో లా నినా ఏర్పాటును సూచించాయని ఐఎండీ చీఫ్ చెప్పారు. అయితే ఇది జరగకపోతే మళ్లీ తాజా గ్లోబల్ మోడల్స్ కోసం వేచి ఉండాల్సి ఉంటుందని.. అప్పుడే దేశంలో ఈ ఏడాది చలి ఎంత, ఎంతకాలం ఉంటుందో చెప్పగలమని పేర్కొన్నారు.
నవంబర్, డిసెంబర్ నెలల్లో లా నినా ఏర్పడుతుందని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇలా జరిగితే.. ఈ సంవత్సరం డిసెంబర్ నుండి ఫిబ్రవరి నెలల్లో తీవ్రమైన చలిని ఎదుర్కోవలసి ఉంటుంది. వాతావరణ శాఖ చీఫ్ మృత్యుంజయ్ మోహపాత్ర మాట్లాడుతూ.. లా నినా సాధారణంగా చలి కాలంలో ఉత్తర, వాయువ్య భారతదేశంలో ఉష్ణోగ్రతల తగ్గుదలతో ముడిపడి ఉంటుంది. కానీ ప్రస్తుతం మనం దీని గురించి ఏమీ ఊహించలేము. ఇంకా అనుకూల పరిస్థితులు ఉన్నా ఇంకా లా నినా ఎందుకు ఏర్పడలేదనే దానిపై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. అన్ని గ్లోబల్ మోడల్‌లలో ఏమి తప్పు జరిగిందో చూడాలని తెలిపారు.