India: వెనిజువెలాపై అమెరికా చేపట్టిన సైనిక దాడులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్లు జనవరి 4, 2026న విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలిపింది. వెనిజువెలా ప్రజల భద్రత, సంక్షేమానికి భారత్ మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేసింది. సమస్యలను శాంతియుతంగా, సంభాషణల ద్వారానే పరిష్కరించుకోవాలని అన్ని పక్షాలకు పిలుపునిచ్చింది. వెనిజువెలాలో శాంతి, స్థిరత్వం కొనసాగాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అలాగే కారకాస్‌లోని భారత రాయబారం అక్కడ ఉన్న భారతీయులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, అవసరమైన సహాయాన్ని అందిస్తామని వెల్లడించింది.
READ MORE: Kamala Harris: వెనిజులా ‘‘చమురు’’ కోసమే ట్రంప్ ఇదంతా చేస్తున్నాడు.. మదురో అరెస్ట్‌పై కమలా హారిస్..
ఇదిలా ఉండగా, శనివారం తెల్లవారుజామున అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ట్రూత్ సోషల్‌లో పోస్టు చేసిన ఆయన, వెనిజువెలాపై పెద్ద ఎత్తున దాడి చేశామని తెలిపారు. ఈ ఆపరేషన్‌లో వెనిజువెలా అధ్యక్షుడు నికోలాస్ మడురోను, ఆయన భార్యను అదుపులోకి తీసుకుని దేశం వెలుపలికి తరలించినట్లు చెప్పారు. ఈ దాడి అమెరికా చట్ట అమలు సంస్థల సహకారంతో జరిగిందని ట్రంప్ పేర్కొన్నారు. మడురో, ఆయన భార్యపై న్యూయార్క్‌లోని ఫెడరల్ అధికారులు నార్కో ఉగ్రవాదం, అమెరికాపై విధ్వంసకర ఆయుధాలు వినియోగించేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణలపై కేసులు నమోదు చేశారు. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
READ MORE: US-Venezuela: ట్రంప్ వెనిజులా దాడి గురించి యూఎస్ మీడియాకు ముందే తెలిసినా, ఎందుకు మౌనంగా ఉన్నాయి.?