India Gets LPG Relief Amid Strait of Hormuz Tensions: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం నాలుగో వారంలోకి ప్రవేశించిన తరుణంలో, భారతదేశానికి ఒక ఊరటనిచ్చే వార్త అందింది. ఎల్‌పీజీ కష్టాలకు నెమ్మదిగా బ్రేక్ పడుతోంది. తాజాగా మరో ఎల్పీజీ నౌక భారత్‌కు చేరింది.. అమెరికాలోని టెక్సాస్ నుంచి ఎల్పీజీని తీసుకువస్తున్న ఒక భారీ సరుకు రవాణా నౌక కర్ణాటకలోని న్యూ మంగళూరు పోర్టుకు విజయవంతంగా చేరుకుంది. పిక్సిస్ పయనీర్ నౌక 16,714 టన్నుల ఎల్పీజీని మోసుకొని మంగళూరు పోర్టుకు చేరింది. వచ్చే వారంలో ఇంకా 72,700 టన్నుల ఎల్పీజీ రానుంది. ఈనెల 25న 26,687 టన్నుల ఎల్పీజీతో అపోలో ఓషన్ రానుంది.. ఈనెల 29న 30 వేల టన్నుల ఎల్పీజీతో మరో నౌక భారత్‌కు చేరనుంది. అంతే కాదు.. గల్ఫ్ ప్రాంతంలోని భారతీయ నౌకలు, నావికులందరూ సురక్షితంగా ఉన్నారని ప్రభుత్వం స్పష్టం చేసింది.
READ MORE: India vs Ireland: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్.. బీసీసీఐ కీలక నిర్ణయం, కొత్త యుగానికి నాంది!
వ్యూహాత్మకంగా ముఖ్యమైన హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ వాణిజ్య మార్గాలకు అంతరాయం ఏర్పడిన తరుణంలో నౌక భారత్‌కు చేరడం గర్వకారణంగా చెబుతున్నారు. ఈ సంక్షోభ సమయంలో ఇంధన సరఫరాలను నిర్ధారించడానికి, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ మార్చి 14 నుంచి 31 వరకు ముడి చమురు, ఎల్పీజీపై కార్గో ఛార్జీల మాఫీని సైతం ప్రకటించడం బిగ్ రిలీఫ్‌గా మారింది. ఈ అంశంపై షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా, అంతర్-మంత్రిత్వ శాఖల సమావేశంలో దేశానికి భరోసా ఇచ్చారు. “గత 24 గంటల్లో సముద్రంలో ఎలాంటి అలజడి, దాడులు చోటు చేసుకోలేదు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్న మన 22 నౌకలు, 611 మంది భారతీయ నావికులు అందరూ సురక్షితంగా ఉన్నారు. మేము వారి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం, ప్రస్తుతం ఏ ఓడరేవులోనూ రద్దీ లేదు” అని స్పష్టం చేశారు. మరోవైపు.. పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ.. దేశంలో ఎల్పీజీ సంక్షోభం ఇప్పుడు అదుపులోకి వచ్చిందని తెలిపారు. వినియోగదారులలో భయాందోళనలతో చేసే బుకింగ్‌లు గణనీయంగా తగ్గాయని అన్నారు. సంక్షోభం ప్రారంభ రోజులతో పోలిస్తే గురువారం కేవలం 55 లక్షల బుకింగ్‌లు మాత్రమే నమోదయ్యాయని స్పష్టం చేశారు.
