India Loses No.1 T20I Ranking: అఫ్గానిస్థాన్‌పై మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 3-0తో క్లీన్‌స్వీప్ చేసినప్పటికీ.. టీ20 ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానాన్ని కోల్పోయింది. 2026లో భారత్ టాప్ ర్యాంక్ కోల్పోవడం ఇది రెండోసారి. శ్రీలంకపై 3-0తో సిరీస్ గెలిచిన ఇంగ్లండ్ మరోసారి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది.
ప్రస్తుతం భారత్, ఇంగ్లండ్ రెండింటికీ 269 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. అయితే మొత్తం పాయింట్లు, ఆడిన మ్యాచ్‌ల ఆధారంగా ఇంగ్లండ్ భారత్‌ను అధిగమించింది. భారత్ 64 మ్యాచ్‌ల్లో 17,201 పాయింట్లు సాధించగా.. ఇంగ్లండ్ కేవలం 41 మ్యాచ్‌ల్లో 11,021 పాయింట్లు నమోదు చేసింది. దీంతో ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ ముందంజలో నిలిచింది.
ఈ ఏడాదిలోనే ఇంగ్లండ్ చేతిలో టీమిండియా మరోసారి నెం.1 ర్యాంక్‌ను కోల్పోయింది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ 4-0తో భారత్‌ను ఓడించిన తర్వాత ఆ జట్టు అగ్రస్థానానికి చేరుకుంది. ఇప్పుడు శ్రీలంకపై 3-0తో సిరీస్ విజయం సాధించడంతో హ్యారీ బ్రూక్ నేతృత్వంలోని ఇంగ్లండ్ మళ్లీ నెం.1గా నిలిచింది.
టీ20 వరల్డ్‌కప్ 2026 సెమీఫైనల్‌లో భారత్, ఇంగ్లండ్ జట్లు ముంబైలోని వాంఖడే స్టేడియంలో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. అప్పటి సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లండ్‌ను ఓడించింది. అనంతరం టోర్నీలో విజేతగా నిలిచిన భారత్.. టైటిల్‌ను కాపాడుకుంది. ఇక ఇంగ్లాండ్ వైపు చూస్తే.. వైట్‌బాల్ కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంగ్లండ్ టీ20ల్లో దుమ్ము రేపుతోంది. అతడి నాయకత్వంలో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 26 టీ20ల్లో 23 విజయాలు సాధించింది. శ్రీలంకతో సిరీస్‌లోనూ బ్రూక్ కీలక పాత్ర పోషించాడు. మూడో టీ20లో శ్రీలంకను 8 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేయడంతో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును అందుకున్నాడు.
సూర్యకుమార్ యాదవ్ తర్వాత శ్రేయస్ అయ్యర్ భారత టీ20 జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. అయితే అతడి కెప్టెన్సీలో తొలి రెండు సిరీస్‌లు భారత్‌కు నిరాశనే మిగిల్చాయి. ఐర్లాండ్‌పై 0-2తో, ఇంగ్లండ్‌పై ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-4తో భారత్ ఓటమి చవిచూసింది. ఆ తర్వాత టీమిండియా తిరిగి పుంజుకుంది. జింబాబ్వేపై 3-0తో, తాజాగా అఫ్గానిస్థాన్‌పై 3-0తో సిరీస్ విజయాలు సాధించింది. ప్రస్తుతం భారత జట్టు ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని కాపాడుకునేందుకు సిద్ధమవుతోంది.
శ్రీలంకపై సిరీస్ విజయం అనంతరం హ్యారీ బ్రూక్ మాట్లాడుతూ.. పరిస్థితులకు అనుగుణంగా ఆడటం తమ విజయానికి ప్రధాన కారణమని చెప్పాడు. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా విజయం సాధించే జట్టుగా ఎదగాలని కోరుకుంటున్నామని తెలిపాడు. ప్రతి మ్యాచ్ భిన్నంగా ఉన్నప్పటికీ పరిస్థితులను చక్కగా అర్థం చేసుకుని ఆడుతున్నామని పేర్కొన్నాడు.

