BCCI confirmed the participation of India Cricket Teams in Asian Games 2023: శుక్రవారం (జూలై 7) ముంబైలో జరిగిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏషియన్ గేమ్స్ 2023కు భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లను పంపాలని నిర్ణయించారు. అయితే చైనాకు మహిళల పూర్తి స్థాయి జట్టును పంపాలని నిర్ణయించగా.. పురుషుల ద్వితీయ శ్రేణి జట్టును పంపాలని బోర్డు నిర్ణయించింది. చైనాలోని హాంగ్‌జౌలో జరగనున్న ఏషియన్ గేమ్స్ సెప్టెంబర్ మరియు అక్టోబర్ మధ్య జరుగుతాయి.
ప్రస్తుతం భారత మహిళల జట్టుకు ఎలాంటి ఐసీసీ టోర్నీలు లేవు. అందుకే ఏషియన్ గేమ్స్ 2023లో రెగ్యులర్ జట్టును బీసీసీఐ బరిలోకి దింపుతోంది. సెప్టెంబర్ 19 నుంచి మహిళల క్రీడలు ఆరంభం అవుతాయి. మరోవైపు భారత్‌లోనే అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ 2023 జరుగనుంది. ఈ నేపథ్యంలో భారత పురుషుల బీ జట్టు పాల్గొంటుంది. పురుషుల ఆట సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభమవుతుంది. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కి కెప్టెన్సీ అప్పగించవచ్చు. అయితే ప్రస్తుతం ఈ నిర్ణయానికి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
Also Read: Ben Stokes Record: బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు.. దిగ్గజాల సరసన చోటు!
2010, 2014 ఆసియా క్రీడల్లో క్రికెట్ ఉన్నా.. భారత్ మాత్రం పాల్గొనలేదు. బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, శ్రీలంక క్రికెట్ జట్లు పాల్గొన్నా.. బీసీసీఐ మాత్రం తమ జట్లను పంపించలేదు. అయితే ఇప్పుడు భారత ఒలింపిక్ సంఘం ఒత్తిడి తేవడంతో ద్వితీయ శ్రేణిని పంపించేందుకు నిర్ణయం తీసుకుంది. చివరిసారి 2014లో ఇంచియాన్‌లో క్రికెట్ మ్యాచులు జరిగాయి.
ఐపీఎల్ 2023 సీజన్‌లో కొత్తగా తీసుకొచ్చిన ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధనను దేశవాళీ టీ20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ అమలు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. టాస్‌కు ముందు ప్లేయింగ్ ఎలెవన్‌తో పాటు నలుగురు ఆటగాళ్ల పేర్లను కూడా ఇరు జట్లు ప్రకటించాల్సి ఉంటుంది. ఇరు జట్టు ఈ నలుగురు ప్రత్యామ్నాయ ఆటగాళ్లలో ఒకరిని మాత్రమే ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా ఎంచుకోవాలి. అక్టోబర్ 16న నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ ఆరంభం కానుంది.
Also Read: Okaya EV Scooters Offers: ఒకయా ఈవీ స్కూటర్లపై భారీ తగ్గింపు.. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్!